గ్రూప్-2 పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరా?

July 04, 2017


img

రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఒకవైపు ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్ -2 పరీక్షలలో అవకతవకల వలన నియామకాలపై పిటిషన్లు దాఖలు అవుతుండటంతో వాటిపై  హైకోర్టు స్టే విధించవలసి వస్తోంది. ఇదివరకు ఒక పిటిషన్ దాఖలైనప్పుడు నాలుగు వారాల పాటు స్టే విధించింది. అటువంటి కారణం చేతే ఈరోజు హైకోర్టు మళ్ళీ మరో నాలుగు వారాలు స్టే విధించింది.

గ్రూప్-2 పరీక్ష పత్రంలో తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టి.ఎస్.పి.ఎస్.సి.) ఏకంగా 14 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఇచ్చిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు నియామకాలపై నాలుగు వారాలు స్టే విధించింది. నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని టి.ఎస్.పి.ఎస్.సి.ను ఆదేశించింది. 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత టి.ఎస్.పి.ఎస్.సి.ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వోద్యోగాల భర్తీ చేస్తోంది. కానీ వాటి కోసం అది నిర్వహిస్తున్న పరీక్షలలో ఇటువంటి లోపాలు దొర్లుతుండటం నిజమైతే దాని వలన తెరాస సర్కార్ విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక మళ్ళీ అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది. 

ఒకవేళ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాలలో ఎటువంటి లోపాలు లేనట్లయితే, ప్రభుత్వానికి పదేపదే ఇటువంటి సమస్యలను సృష్టిస్తున్నవారిని గుర్తించి వారిపై కటిన చర్యలు తీసుకోవడం కూడా అంతే అవసరం.  


Related Post