కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా మరో సవాలు విసిరారు. సూర్యాపేట మండలం రాయినిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ కు 2019 ఎన్నికలను ఎదుర్కోవడానికి లోలోన చాలా భయపడుతున్నారు. అందుకే ప్రతీ 3 నెలలకు ఒకసారి భూటకపు సర్వేలు చేయించుకొంటూ తనకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించుకొంటుంటారు. ఆయనకు తన సర్వేలపై అంత నమ్మకమే ఉంటే ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరిన 25 మందిలో కనీసం 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్ళడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒకవేళ ఆయన సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి వారిని మళ్ళీ గెలిపించుకోగలిగినట్లయితే వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయను. వీలైతే మా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించి వచ్చే ఎన్నికలలో మా పార్టీ నుంచి మీకు పోటీ లేకుండా చేసి మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరిస్తాను,” అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి సవాలు విసిరారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి వాదన సహేతుకంగానే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున అటువంటి సవాళ్ళు, హామీలు ఇవ్వడానికి ఆయనేమీ పార్టీ అధ్యక్షుడు కాదు. పైగా రాజకీయ నాయకుల అహం, వారి ఆర్ధిక, రాజకీయ బలాలను ప్రదర్శించుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని కోరుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. వారి దృష్టిలో ఎన్నికలంటే చిన్న పిల్లలు ఆడుకొనే ఆటలు అన్నట్లుగా ఉన్నాయి. ఒకవేళ ఆయనకు తనపై తనకు అంత నమ్మకమున్నట్లయితే తెరాసకు ఇటువంటి సవాళ్లు విసిరేబదులు తనే పదవికి రాజీనామా చేసి తన బలనిరూపణ చేసుకోవచ్చు కదా! అప్పుడు ప్రజలే ఎవరు తగిన వ్యక్తో నిరూపిస్తారు కదా!
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు కనుక కోమటిరెడ్డి వంటివారు ఎన్ని సవాళ్ళయినా విసరగలరు. అది కొండను వెంట్రుకతో ముడివేసి లాగే ప్రయత్నమే అని చెప్పవచ్చు. కదిలితే కొండ వస్తుంది లేకుంటే వెంట్రుక పోతుందనే ఆలోచనే అది. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ కూడా కోరుండి కొరివితో తల గోక్కోవు కనుకనే తెరాస ఇటువంటి సవాళ్ళను స్వీకరించడం లేదని చెప్పవచ్చు.