రాష్ట్రపతి ఎన్నికలు మన రాజకీయ పార్టీల అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. మన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలను ప్రజలుగా కాకుండా ఓటర్లుగా చూస్తుంటాయి. మళ్ళీ వారిని కులాలు,మతాలు వారిగా విభజించుకొని ఓటు బ్యాంకులుగా లెక్కలు వేసుకొని ఎన్నికలలో టికెట్లు ఇస్తుండటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలలో కూడా అదే జరుగుతోంది.
రాంనాథ్ కోవింద్ ను భాజపా తమ అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత అతను దళితుడని, దళితుల పట్ల తమకున్న అపారమైన ప్రేమాభిమానాలకే అదే నిదర్శనమని గొప్పగా చెప్పుకొని, ఆయన ఎంపికతో దేశంలో దళితులందరినీ ఉద్దరిస్తున్నట్లుగా భాజపా నేతలు మాట్లాడారు. దళితుల పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడాన్ని అందరూ విమర్శించడంతో మాటమార్చి అయన గొప్ప మేధావి అందుకే ఆయనను ఎంపిక చేశామని సర్దిచెప్పుకొన్నారు.
అయితే భాజపాను విమర్శిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూడా అందుకు భిన్నంగా వ్యవహరించలేదు. దళితుడైన రాంనాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వకపోతే తమకు రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కనుక ఆ సమస్య నుంచి బయటపడటానికే దళితురాలైన మీరా కుమార్ ను అభ్యర్ధిగా నిలబెట్టాయి తప్ప ఆమెపై లేదా దళితులపై ప్రేమతో కాదనే సంగతి అందరికీ తెలుసు.
కానీ మద్యలో గాంధీజీ సిద్దాంతాలు..ఆశయాలు..ప్రజాస్వామ్య విలువలు..దళితులు..వారి హక్కులు..గౌరవం అంటూ పడికట్టు పదాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. వారికి ప్రజల విచక్షణ, వివేకంపై చాలా చులకనభావం ఉన్నందునే ఆవిధంగా మభ్యపెట్టేప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.
భాజపా తెలంగాణా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నిన్న మీడియాతో అన్న మాటలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. “ కాంగ్రెస్ పార్టీ దళితులను ఎప్పుడూ ప్రజలుగా చూడలేదు. వారిని ఓటర్లుగా మాత్రమే చూసింది. వారిని తన రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగించుకొంది తప్ప వారికి మేలు చేసే ప్రయత్నాలు ఎన్నడూ చేయలేదు,” అని అన్నారు.
నిజానికి భాజపా కూడా దళితులను ఓటర్లుగా మాత్రమే చూస్తుంనందునే రాంనాథ్ కోవింద్ పేరు ప్రకటించినప్పుడు ఆయన కులం గురించి టాంటాం చేసుకొంది. యూపిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆ రాష్ట్రంలో దళితులతో సహా పంక్తి భోజనాలు చేయడం అందుకు మరో ఉదాహరణ.
కానీ గమ్మతైన విషయం ఏమిటంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే మైనార్టీలు, దళితులపై వరుసగా దాడులు జరుగుతుంటే, “ఆ బాధ్యత స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలదే అని..గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇంతకంటే ఎక్కువ దాడులే జరిగాయని’ అమిత్ షా వాదిస్తున్నారు. దళితులు, మైనార్టీలపై భాజపాకు ఏపాటి ప్రేమ ఉందో స్పష్టం అవుతోంది. అయితే భాజపా ఒక్కటే కాదు..దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇలాగే వ్యవహరిస్తుంటాయి. కనుక వాటి మాటలు విని ఎవరూ నమ్మనవసరం లేదు.