మోడీ ఇజ్రాయెల్ పర్యటనతో భారత్ కు మేలు

July 04, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఇజ్రాయిల్ దేశంలో పర్యటించబోతున్నారు. రక్షణ, వ్యవసాయం రంగంలో ఇజ్రాయెల్ కు తిరుగులేదు. ఆ రెండు రంగాలలో అమెరికాతో పోటీ పడగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దాని స్వంతం. ఆ రెండు రంగాలలో ఇజ్రాయెల్ సహాయ సహకారాలు కోరేందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ   పర్యటన పెట్టుకొన్నారు. ఇజ్రాయెల్ తో భారత్ కు చిరకాలంగా మంచి స్నేహసంబంధలున్నాయి. ఇజ్రాయెల్ నుంచి మన దేశం ఏటా సుమారు రూ.6,500 కోట్లు విలువగల రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తునందున సహజంగానే అది భారత్ కు చాలా ప్రాదాన్యత ఇస్తుంటుంది. 

ప్రధాని నరేంద్ర మోడీ తన తొలి భేటీలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఆకట్టుకొని ఆయన మన దేశానికి అనుకూలంగా వ్యవహరించేలాగ చేయగలిగారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యటన తరువాత ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కూడా భారత్ పట్ల సానుకూల దృక్పధం ప్రదర్శించవచ్చు. 

ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలతో భారత్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ సహాయసహకారాలు, మద్దతు భారత్ కు చాలా అవసరమే కనుక మోడీ ఇజ్రాయెల్ పర్యటన చాలా కీలకమైనది..వ్యూహాత్మకమైనదేనని చెప్పవచ్చు.   

ఈ పర్యటనలో సాగునీరు, వ్యవసాయం, రక్షణ, సైబర్ భద్రత అంతరిక్ష పరిజ్ఞానం తదితర రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. 

ఇంతవరకు విదేశాలకు డబ్బు చెల్లించి రక్షణ తదితర రంగాల ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. కానీ మోడీ ఆ విధానాన్ని మార్చి ‘మేక్ ఇన్ ఇండియా’ పధకంలో భాగంగా ఆ ఉత్పత్తులను భారత్ లో తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంస్థలు, దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆవిధంగానే మన దేశంలో అత్యాధునిక ఎఫ్-16 యుద్దవిమానాలు తయారుకాబోతున్నాయి. ఇజ్రాయెల్ తో కూడా మోడీ అటువంటి ఒప్పందమే చేసుకోబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే మనకు మరింత అత్యాధునిక రక్షణ, వ్యవసాయ పరికరాలను తయారు చేసే సంస్థలు వస్తాయి. వాటితోబాటు ఆ రెండు రంగాలలో ఇజ్రాయెల్ కున్న అపార అనుభవం కూడా భారత్ కు అందుబాటులోకి వస్తుంది. 


Related Post