తెలుగు సినీ పరిశ్రమలో ఎవరిదారి వారిదేనా?

July 03, 2017


img

సినిమాలపై 28శాతం జి.ఎస్.టి.ని విదించడాన్ని నిరసిస్తూ నేటి నుంచి తమిళనాడులో 955 సినిమా థియేటర్లు మూసి వేసి వాటి యజమానులు నిరసనలు తెలుపుతున్నారు. ఆ జి.ఎస్.టి. వేడి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రానికి కూడా పాకింది. తెలంగాణా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలో వారు నేటి నుంచి హైదరాబాద్ లో రిలే నిరాహారదీక్షలు మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న సినీ పరిశ్రమపై 28 శాతం జి.ఎస్.టి. విధిస్తే మొత్తం పరిశ్రమ అంతా కుప్పకూలుతుందని, దానిపై ఆధారపడిన వేలాదిమంది, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని రామకృష్ణ గౌడ్ అన్నారు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణం జి.ఎస్.టి.ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. సినీ పరిశ్రమపై దశాబ్దాలుగా కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని, వారి కబంద హస్తాల నుంచి బయటపడలేక నలిగిపోతున్న చిన్న నిర్మాతలు..వారి సినిమాలపై ఇప్పుడు కేంద్రప్రభుత్వం కూడా కక్ష కట్టినట్లుగా 28శాతం జి.ఎస్.టి. విధించడం చాలా అన్యాయమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే జి.ఎస్.టి.ని ఉపసంహరించుకోవాలని నారాయణ మూర్తి డిమాండ్ చేశారు. 

ఈ సమస్యపై తెలంగాణా ఫిలిం ఛాంబర్ చొరవ తీసుకోవడం చాలా అభినందనీయమే కానీ ఇటువంటి సమస్యపై ఒంటరిగా పోరాడటం కంటే తెలుగు సినీ పరిశ్రమలో అందరూ కలిసి కట్టుగా పోరాడినట్లయితే ఏమైనా ఫలితం ఆశించవచ్చు. ఎందుకంటే సినీపరిశ్రమలో ఆంధ్రాకు చెందినవారందరికీ రాజకీయ నేతలతో, పార్టీలతో, ప్రభుత్వాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బలమైన పరిచయాలున్నాయి. ఆ కారణంగా వారికి మంచి పలుకుబడి కూడా ఉంది. పైగా జి.ఎస్.టి. సమస్యకు వారేమీ అతీతులు కారు. వారు కూడా దీని వలన నష్టపోతారు. కనుక సినీ పరిశ్రమలో తెలంగాణా, ఆంధ్రావారందరూ తమ విభేదాలను, పంతాలు, పట్టింపులను పక్కనబెట్టి కలిసికట్టుగా పోరాడితే ఏమైయినా ఫలితం ఆశించవచ్చు. లేకుంటే చివరికి అందరూ జి.ఎస్.టి.కి మూల్యం చెల్లించక తప్పదు. 


Related Post