మజ్లీస్- తెరాస పార్టీల మద్య ఎన్నికల పొత్తులు లేనప్పటికీ వాటి మద్య మంచి స్నేహం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో భిన్నంగా వ్యవహరించే అవకాశం కనబడుతోంది. తెరాస ఎన్డీయే అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ మజ్లీస్ పార్టీ భాజపాను బద్దశత్రువుగా భావిస్తుంటుంది. ఆ లెక్కన చూస్తే ఎన్డీయే అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు అది మద్దతు ఇవ్వకపోవచ్చు. కానీ తెరాస కోసం బద్ధశత్రువైన భాజపా అభ్యర్ధికి మద్దతు ఇస్తుందా లేక తెరాసను కాదని మీరా కుమార్ కు మద్దతు ఇస్తుందా అనే విషయంపై ఈరోజు ఆమె హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్పష్టత రావచ్చు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిసి మీరా కుమార్ కు మద్దతు కోరారు. కనుక ఒకవేళ మజ్లీస్ పార్టీ ఆమెకు మద్దతు పలికితే తెరాసకు దూరమై కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుందని కాంగ్రెస్ నేతలు కలలు కన్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు మజ్లీస్ తో దోస్తీ కొనసాగిస్తూనే దాని అవసరం లేకుండా వచ్చే ఎన్నికలలో విజయం సాధించేందుకు ముస్లింలకు రిజర్వేషన్ అంశం లేవనెత్తారు. కనుక మజ్లీస్ పార్టీ తమవైపుకు వచ్చే అవకాశం ఉందని తెలంగాణా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఒకవేళ మజ్లీస్ పార్టీ మీరా కుమార్ కు మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తో దాని దోస్తీ ఈ రాష్ట్రపతి ఎన్నికల వరకే పరిమితంగా ఉంటుందా లేక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా వాటి దోస్తీ కొనసాగుతుందో చూడాలి. మజ్లీస్ పార్టీకి ఒక ఎంపి, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నందున మీరా కుమార్ కు ఆ పార్టీ మద్దతు చాలా ఉపయోగపడుతుంది.