తెరాస సర్కార్ అధికారం చేపట్టిన తరువాత మొదట విద్యుత్ తరువాత సాగుత్రాగునీరు ప్రాజెక్టులు, శాంతిభద్రతల నియంత్రణ, మౌలికవసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు..మొదలైన పనులను వరుసగా చేసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న కల్తీ వ్యాపారుల ఆటకట్టించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానిపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో ఆదివారం ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు.
తెలంగాణాలో కల్తీ వ్యాపారాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ కోరారు. అందుకోసం అవసరమైతే కటినమైన చట్టాలు తీసుకువస్తామని చెప్పారు. కల్తీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కటినచర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖలో వేరేగా కల్తీ నిరోధక టీమ్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ పదార్ధాలలో కల్తీలను గుర్తించడానికి పోలీస్ శాఖకు అవసరమైన ఆధునిక పరికరాలను అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇకపై కల్తీ వ్యాపారులను పట్టుకొన్న పోలీసులకు ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్ లు కూడా ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో జూదం, గుడుంబాలను ఏవిధంగా అరికట్టారో అదే విధంగా కల్తీ వ్యాపారాలను కూడా అరికట్టాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను కోరారు. దీని కోసం ఇతరశాఖాల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణా పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని, రాష్ట్రంలో కల్తీలను అరికట్టగలిగితే వారికి ఇంకా మంచి పేరు వస్తుందని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో కల్తీ వ్యాపారాలను అరికట్టడం చాలా అవసరమే. కానీ నిజాయితీగా వ్యాపారాలు చేసుకొంటున్న వారిని ఆ పేరుతో పోలీసులు పీడించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరమే. దాదాపు అన్ని రకాల వస్తువులలో కల్తీ జరుగుతోంది కనుక వ్యవసాయం, తూనికలు, ఆహారం, వైద్య ఆరోగ్య, ఇంధన తదితర శాఖల మద్య చాలా సమన్వయం అవసరం. ఇది నిరంతరంగా సాగవలసిన కార్యక్రమం కనుక కల్తీ నిరోదించడానికి ఆయా శాఖాల అధికారులతో కలిసి పోలీస్ శాఖ ఒక శాశ్విత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. లేకుంటే కల్తీని అరికట్టలేకపోగా ప్రభుత్వ శాఖల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కల్తీని అరికట్టేందుకు కృషి చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు, ఇన్సెంటివ్ లు ఇవ్వకపోయినా పరువాలేదు కానీ వారిపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా చేయడం చాలా అవసరం. అప్పుడే ఆశించిన ఫలితాలు కనబడుతాయి.