నేను బలిపశువును కాను: మీరా కుమార్

July 01, 2017


img

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యూపియే కూటమి రాజకీయ ప్రయోజనాల కోసం మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ను బలిపశువుగా చేశారనే వాదనలపై ఆమె తీవ్రంగా స్పందించారు. “నేను ప్రజాస్వామ్య విలువల కోసం, సిద్దాంతపరంగా ఈ పోరాటం మొదలుపెట్టాను. కనుక నేను ఒక పోరాట యోధురాలినే తప్ప బలిపశువును కాను. నన్ను ఎవరూ బలిపశువుని చేయలేరు కూడా. నా ఈ పోరాటానికి 17 పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. రానున్న రోజులలో ఇంకా అనేకమంది మద్దతు ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఆమాద్మీ పార్టీ నన్ను బలపరచడమే తాజా ఉదాహరణ,” అని అన్నారు.

మీరా కుమార్ ను కాంగ్రెస్ ఎందుకు నిలబెట్టిందో అందరికీ తెలుసు. తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న నరేంద్ర మోడీకు అడ్డుకట్టవేసి ప్రతిపక్షాల ఐక్యతను ఆయనకు రుచి చూపించడానికి రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు నిశ్చయించుకొన్నాయి. అందుకే ఎన్డీయే తన అభ్యర్ధిని ప్రకటించక మునుపే తమ అభ్యర్ధి గురించి చర్చించాయి. ఎన్డీయే కూటమిదళితుడైన రాంనాథ్ కోవింద్ ను నిలబెట్టి కాంగ్రెస్, మిత్రపక్షాలను ఇరుకున పెట్టడంతో ఆయనకు పోటీగా మీరా కుమార్ ను నిలబెట్టాయి. అయితే 17 పార్టీల ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చినా ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం లేదని మీరా కుమార్ తో సహా అందరికీ తెలుసు. ఓటమి ఖాయం అని తెలిసి ఆమెను బరిలోకి దింపడం అంటే బలిపశువుగా నిలబెట్టినట్లే కదా? 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తెలంగాణా తెదేపా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆర్. కృష్ణయ్యను నిలబెట్టినప్పుడు కూడా అందరూ ఇదే మాట అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. బహుశః మీరా కుమార్ కు కూడా అదే పరిస్థితి ఎదురవవచ్చు. 


Related Post