తెరాసతో భాజపా యుద్దాలు మళ్ళీ షురూ?

July 01, 2017


img

తెరాస, భాజపాలు రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా తీవ్రంగా విభేధించుకొంటున్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం చక్కటి అవగాహనతో కలిసి పనిచేస్తుంటాయి. జి.ఎస్.టి.,రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలలో తెరాస మోడీ సర్కార్ కు సహకరిస్తే,  తెలంగాణా ప్రాజెక్టుల విషయంలో మోడీ సర్కార్ తెరాసకు సహకరిస్తుంటుంది. నిజానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య అటువంటి అవగాహనే ఉండాలి. అప్పుడే రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. కేంద్రం బలంగా ఉంటుంది. 

కాంగ్రెస్, తెదేపాల పట్ల చాలా కటినంగా వ్యవహరించే తెరాస భాజపా విషయంలో ఎపుడూ చాలా సంయమనంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమనే ఆలోచనతోనే భాజపా విమర్శలను పట్టించుకోవడం లేదని భావించవచ్చు. కానీ భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ పర్యటన సందర్భంగా తెరాస సర్కార్ కు చాలా ఇబ్బందికరమైన సవాళ్ళు విసిరారు కనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చాలా ఘాటుగా స్పందించవలసి వచ్చింది. దానికి రాష్ట్ర భాజపా నేతలు కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ, ఆ తరువాత రాష్ట్రపతి ఎన్నికలలో తెరాస మద్దతు అవసరంపడటంతో వారు ఇన్ని రోజులుగా మౌనం వహించారు. 

జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. కనుక అప్పటి వరకు రాష్ట్ర భాజపా నేతలు మౌనంగానే ఉండవచ్చు. కానీ ఆ తరువాత ప్రజాసమస్యలపై మళ్ళీ తెరాస సర్కార్ తో యుద్దాలు చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆలోగా పార్టీని అంతర్గతంగా చక్కబెట్టుకొని, జూలై నెలాఖరు నుండి సెప్టెంబర్ లో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాకు వచ్చే వరకు తెరాస సర్కార్ పై ఉదృత స్థాయిలో పోరాటాలు చేయడానికి కార్యాచరణను రూపొందించుకొంటున్నారు. అప్పుడు తెరాస కూడా ముస్లిం రిజర్వేషన్ల బిల్లు, గోవధ గురించి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

తెరాస-భాజపాల ఈ తీరు చూస్తుంటే అవి నిజంగా విభేధించుకొంటున్నాయా లేక ఆవిధంగా నటిస్తూ తమ రాజకీయ ప్రత్యర్ధులను మభ్యపెడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ అవి వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోదలిస్తే వచ్చే ఏడాది కేంద్రరాష్ట్ర బడ్జెట్ సమావేశాల తరువాత మెల్లగా దగ్గరయ్యే ప్రయత్నాలు చేయవచ్చు. లేకుంటే వాటి మద్య ఇక పొత్తులు ఉండవనే భావించవచ్చు.


Related Post