దేశవ్యాప్తంగా బట్టల దుఖాణాల యజమానులు జి.ఎస్.టి.భారాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు దుఖాణాలు బంద్ చేసి నిరసనలు తెలియజేశారు. ఇప్పుడు తమిళనాడులో సినిమా థియేటర్ల యజమానులు సోమవారం నుంచి నిరవధికంగా థియేటర్లను మూసివేసి నిరసనలు తెలియజేయడానికి సిద్ధం అవుతున్నారు రూ.100 లోపు టికెట్లపై 18శాతం, అంతకు మించిన టికెట్స్ పై 28 శాతం జి.ఎస్.టి. విధించబడింది. అంతబారీగా పన్ను విధిస్తే ఇక థియేటర్లలో సినిమాలు నడిపించడం చాలా కష్టమని చెపుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ఉన్న హాలీవుడ్ సినిమాలతో సమానంగా ప్రాంతీయ సినిమాలపై జి.ఎస్.టి.వసూలుచేయడాన్ని నటుడు కమల్ హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ సినిమాలపై జి.ఎస్.టి. తగ్గించకపోతే సినిమాలు చేయడం మానుకొంటానని హెచ్చరించారు. కానీ జి.ఎస్.టి. కౌన్సిల్ పట్టించుకోలేదు. సోమవారం నుంచి తమిళనాడులో మొత్తం 950 థియేటర్లు మూతపడనున్నాయి. మల్టీ ప్లెక్స్ థియేటర్లతో సహా తమిళనాడులో అన్ని థియేటర్లను మూసి వేయాలని థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే చాలా థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్స్ నిలిపివేశారు. తమిళనాడు సినీ నిర్మాతలు, నడిగర్ సంఘం కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు.
ఈ సమస్య ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు కనుక త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలలో జి.ఎస్.టి. తగ్గింపు కోరుతూ ఆందోళనలు మొదలైన ఆశ్చర్యం లేదు. సినీ పరిశ్రమలో ఏ శాఖ సమ్మె చేసినా అందరి కంటే ముందుగా బలైయ్యేది జూనియర్ ఆర్టిస్టులు, లైట్ బాయ్స్ వంటి చిన్నచిన్న పనివారే. తరువాత నిర్మాతలు కూడా చాలా నష్టపోతారు. ముఖ్యంగా సినిమా నిర్మాణం పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాల నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారుతుంది.
దేశంలో సినీ పరిశ్రమపై నేరుగా ఆధారపడినవారు కొన్ని వేలమంది ఉంటే, దానికి జనరేటర్లు, రవాణా సౌకర్యాలు, ఆహారం, ఇతర సామాగ్రి ఏర్పాటు చేస్తూ పరోక్షంగా ఉపాధి పొందుతున్నవారు అనేక వేలమంది ఉంటారు. కనుక వారందరి ఆందోళనను అర్ధం చేసుకొని జి.ఎస్.టి.ని తగ్గించవలసి ఉంది.