జి.ఎస్.టి.ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె పార్టీలు హాజరుకాలేదు కానీ వాటి మిత్ర పక్షాలు కొన్ని హాజరయ్యాయి. అవి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడానికి కారణం ఏమిటో తనకు అర్ధం కావడం లేదని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత అన్నారు. జి.ఎస్.టి. చట్టంపై పార్లమెంటు ఉభయసభలలో లోతుగా చర్చలు జరిగాయి. వాటిపై అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్రప్రభుత్వం స్వీకరించి దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసిన తరువాత దానిని పార్లమెంటులో అన్ని పార్టీలు ఆమోదించాయి. ఆ తరువాత జి.ఎస్.టి.కౌన్సిల్ సమావేశాలలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రతినిధులు కూడా పాల్గొని అనేక సూచనలు చేశారు. నిజానికి ఈ జి.ఎస్.టి.ప్రతిపాదనను చేసిందే కాంగ్రెస్ పార్టీ.
ఇన్ని పరిణామాలు జరిగిన తరువాత జి.ఎస్.టి. ప్రారంభోత్సవానికి కాంగ్రెస్, వామపక్షాలు హాజరుకాకపోవడం చాలా విచిత్రంగా ఉంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు మేలు కలిగిస్తుందనే ఉద్దేశ్యంతోనే జి.ఎస్.టి.కి మద్దతు ఇచ్చాము. జి.ఎస్.టి.పై మాకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వాటి కోసం ఇటువంటి చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని బహిష్కరించనవసరం లేదు. మున్ముందు చర్చల ద్వారా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకొనే ప్రయత్నాలు చేస్తాము,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జి.ఎస్.టి.పై ద్వందవైఖరి ప్రదరిస్తే ప్రస్తుతం విదేశాలలో పర్యటిస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘జి.ఎస్.టి. కేవలం ఒక తమాషా’ అని ట్వీట్ చేసి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకొన్నారు. అది ఒక తమాషా అయితే దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశాలలో కాంగ్రెస్ మంత్రులు ఎందుకు పాల్గొన్నారు?
దేశాన్ని అత్యధిక కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తన హయంలో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. మోడీ సర్కార్ తీసుకొంటోంది. వాటి వలన మోడీ పేరు దేశవిదేశాలలో మారుమ్రోగిపోతోంది. అందుకే అది అసూయతో ఈవిధంగా ప్రవర్తిస్తోందేమో?
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఈవిధంగా అనాలోచితంగా వ్యవహరిస్తుంటే, ప్రాంతీయ పార్టీ అయిన తెరాస కాంగ్రెస్ కంటే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ ఎన్డీయే భాగస్వామి కానప్పటికీ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చాలా వివేకంతో వ్యవహరించి అందరి మన్ననలు అందుకొంటోంది.