దేశవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి జి.ఎస్.టి. అమలులోకి వచ్చింది. ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏమన్నారంటే, “జి.ఎస్.టి. అంటే కేవలం కొత్త పన్ను విధానం మాత్రమే కాదు...ఇది ఒక ఆర్ధిక సంస్కరణ కూడా. దేశ ఆర్ధిక వ్యవస్థను పారదర్శకంగా, పటిష్టపరిచేందుకు ఉపయోగపడే మహత్తర ప్రయత్నం ఇది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. 125 కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేయడానికి వేసిన ఒక ముందడుగు ఇది.
“ఒకప్పుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ మన దేశంలోని సంస్థలను అన్నిటినీ విలీనం చేయడం ద్వారా భారతదేశానికి సమగ్ర రూపం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ జి.ఎస్.టి. ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్ధికరూపంలో ఏకం అవుతాయి. ఈ జి.ఎస్.టి. దేశంలో అన్ని రాష్ట్రాలు..ప్రాంతాలు ముత్యాలదండలో ముత్యాలలాగ ఒక్క త్రాటిపైకి వస్తాయి. ఫెడరల్ సూర్తి ప్రస్పుటంగా కనబడుతుంది.”
“ఇంతవరకు దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి సుమారు 500 రకాల పన్నులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తొలగిపోయి ఈ జి.ఎస్.టి.తో ‘ఒకే దేశం ఒకే పన్ను విధానం’ అమలులోకి వస్తుంది. దీని వలన రానున్న రోజులలో సామాన్య ప్రజలకు చాలా మేలు కలుగుతుంది. దీనిపై నెలకొన్న అనుమానాలు, అపోహలు అన్నీ త్వరలోనే పటాపంచలు అవుతాయి.”
ఈ మహత్తర ఆలోచనకు నాంది పలికిన గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి సమక్షంలో..వారి చేతుల మీదుగానే దీనిని ప్రారంభించడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. అయితే ఇది నా ప్రభుత్వ విజయమో లేక ఒక పార్టీ విజయంగానో నేను భావించడం లేదు. ఇది సమిష్టి కృషితో సాధించిన సమిష్టి విజయంగా భావిస్తున్నాను. ఈ మహత్తర కార్యంలో పాలు పంచుకొన్న పెద్దలు, మేధావులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.