సుమారు ఒకటిన్నర దశాబ్దాలుగా ఏకీకృత పన్ను విధానం (జి.ఎస్.టి.)ని అమలు చేసేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన మూడేళ్ళలోనే దానిని అమలులోకి తీసుకురాగలిగారు. అనేక అవరోధాలను అధిగమించి ఎట్టకేలకు ఈరోజు (జూన్ 30వ తేదీ) అర్ధరాత్రి జి.ఎస్.టి.ను ప్రారంభించబోతున్నారు. భారతదేశ ఆర్దిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేయబోతున్న ఈ జి.ఎస్.టి.ని ప్రారంభించేందుకు ఈరోజు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.
పార్లమెంటు ఈవిధంగా అర్ధరాత్రి సమావేశం కావడం ఇది మూడవసారి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా 1947, ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మళ్ళీ 50వ స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి సమావేశం నిర్వహించారు. మళ్ళీ ఈరోజు జి.ఎస్.టి.ని ప్రారంభించేందుకు అర్ధరాత్రి వరకు పార్లమెంటు సమావేశం నివహిస్తున్నారంటే దానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పార్లమెంటు సెంట్రల్ హాల్ లో జరుగబోయే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి మొహమ్మద్ హమీద్ అన్సారి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ఎంపిలు తదితరులు హాజరవుతారు. వారితోబాటు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, ఇంకా కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జి.ఎస్.టి. కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, అలనాటి ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయని లతా మంగేష్కర్ తదితర ప్రముఖులు కూడా హాజరవుతారు.
భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఎన్డీయే మిత్రపక్షాల ప్రతినిధులు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల మాజీ ఆర్ధిక మంత్రులు తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
ఆర్.బి.ఐ. గవర్నర్ ఉర్జిత్ పటేల్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా, మెట్రో పితామహుడు ఇ.శ్రీధరన్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, పారిశ్రామిక మండళ్ల సారథులు పంకంజ్ పటేల్ (ఫిక్కీ), శోభనా కామినేని (సీఐఐ), సునీల్ కనోరియా (అసోచాం), కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ తదితరులు, ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు, కాగ్ ప్రస్తుత మరియు మాజీ అధికారులు, ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్లు బిమల్ జలాన్, వై.వి.రెడ్డి, దువ్వూరి సుబ్బారావు ఇంకా అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్ళాయి. వారిలో చాలామంది ఈ కార్యక్రమానికి హాజరకాబోతున్నారు.
ఇంత చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మాజీ ఆర్ధికమంత్రి, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆర్ధికమంత్రి తదితరుల ప్రసంగాల తరువాత రాత్రి సరిగ్గా 12 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గంట మ్రోగించడంతో దేశంలో జి.ఎస్.టి. అమలులోకి వస్తుంది.