కేటిఆర్ వార్నింగ్ ఇచ్చారు కానీ...

June 30, 2017


img

తెలంగాణా రాష్ట్ర ఐటి మరియు గనుల శాఖ మంత్రి కేటిఆర్ గనులశాఖ అధికారిక వెబ్ సైట్ ను గురువారం ప్రారంభించారు. గనులశాఖలో అవినీతి అక్రమాలు జరుగకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై మైనింగ్ ఫీజులు వగైరా చెల్లింపులన్నీ ఈ పోర్టల్ ద్వారానే స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గనుల శాఖ వ్యవహారాలను సమీక్షించారు. గనుల త్రవ్వకాలకు అనుమతులు పొంది పనులు ప్రారంభించని వారివి, త్రవ్వకాలలో అక్రమాలకు పాల్పడుతున్నవారివి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికారులు ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం కటినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంత్రి కేటిఆర్ అధికారులకు, అక్రమాలకు పాల్పడుతున్న గట్టిగా హెచ్చరికలు చేశారు. మంచిదే. కానీ ఏ రాష్ట్రంలోనైనా గనులశాఖ అంటే అవినీతి, అక్రమాలకు నిలయమనే చెడ్డ పేరుంది. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, వారి బంధువులు లేదా రాజకీయ పార్టీలతో బలమైన సంబంధాలున్నవారే ఎక్కువగా ఈ గనుల త్రవ్వకాలకు లైసెన్సులు పొందుతుంటారు. వారిని అధికారులు నియంత్రించడం అసంభవం. 

మున్సిపల్ శాఖకు కూడా మంత్రిగా ఉన్న కేటిఆర్ గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు, డ్రైనేజీ పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లను అనేకసార్లు హెచ్చరించారు. అనేకమందిపై చర్యలు కూడా తీసుకొన్నారు. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. మొదటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విశ్వనగరంలో అనేక రోడ్లు గోతులు, బురద, మురికితో నిండిపోయాయి. ఏ టీవీ ఛానల్ పెట్టినా హైదరాబాద్ రోడ్ల దుస్థితి గురించే కధనాలు కనిపిస్తుంటాయి. 

రాజధానిలో కాంట్రాక్టర్లనే నియంత్రించలేనప్పుడు ఎక్కడో ఖమ్మం, వికారాబాద్ జిల్లాలలో గనుల త్రవ్వకాలు జరుపుతున్న వారిని నియంత్రించడం సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లుగా లేదా కాంట్రాక్టర్లే రాజకీయ నాయకులుగా మారినప్పుడు ఇటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యం. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులనే బహిరంగంగా చెంప చెళ్ళుమనిపిస్తున్న మన నేతలను, ప్రజాప్రతినిధులను అధికారులు నియంత్రించగలరా? 


Related Post