కేసీఆర్ పై నిజంగానే సిబిఐ కేసులున్నాయా?

June 29, 2017


img

తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్ళీ చాలా రోజుల తరువాత గురువారం మీడియా ముందుకు వచ్చి యధాప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేశారు. 

కేసీఆర్ గతంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనపై అనేక సిబిఐ  కేసులు నమోదు అయున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై ఈ.ఎస్.ఐ.ఆసుపత్రుల కేసు, సహారా ఇండియా ఉద్యోగుల ప్రావిడెంట్ కేసు, ఇంకా అనేక ఇతర కేసులు ఉన్నాయని, ఈ మూడేళ్ళలో సిబిఐ అధికారులు నాలుగు సార్లు హైదరాబాద్ వచ్చి వాటిపై ఆయనను ప్రశ్నించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా కేసీఆర్ దాచిపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఈ సిబిఐ కేసుల భయంతోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ముందు సాగిలపడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. జి.ఎస్.టి. వల్ల రాష్ట్రానికి చాలా నష్టం వస్తుందని తెలిసి ఉన్నప్పటికీ కేసుల భయంతోనే కేసీఆర్ దానికి మద్దతు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జి.ఎస్.టి. వలన రాష్ట్రానికి సుమారు రూ.20,000 కోట్లు నష్టం రావచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో నగదు కొరత ఏర్పడిందని దాంతో పొలాలలో ఉండవలసిన రైతులందరూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

రేవంత్ రెడ్డి చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై నేడో రేపో తెరాస నేతలు ధీటుగానే స్పందించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజమో, అబద్ధమొ తేలవలసిన అవసరం ఉంది. జి.ఎస్.టి. విషయంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి గట్టిగా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. మరి తమ పార్టీ అధినేత స్వయంగా జి.ఎస్.టి.కి మద్దతు పలుకుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడటానికి అర్ధం ఏమిటో? ఏపిలో జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుపై సరిగ్గా ఇటువంటి ఆరోపణలే చేస్తున్నారు. వాటిని ఆయన గట్టిగా ఖండిస్తుంటారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరోపణలపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post