త్వరలో రూ.200 నోట్లు

June 29, 2017


img

నోట్లరద్దు..వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టి ఇప్పటికి 6 నెలలు గడుస్తున్నపటికీ ఇంకా దేశప్రజలు నోట్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మార్కెట్లో నుంచి ఉపసహంరించిన మొత్తానికి సరిసమానమైన కొత్త నోట్లను మార్కెట్లోకి విడుదల చేశామని రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఆర్ధిక శాఖ చెప్పుకొంటున్నప్పటికీ, ఆ నగదు ఎక్కడా కంటికి కనబడటం లేదు. నల్లధనం వెలికి తీయడానికే పాతనోట్లను రద్దు చేశామని కేంద్రప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల పట్టుబడుతున్న పాము పాండురంగారావు వంటి అవినీతి అధికారుల వద్దే వందల కోట్ల నగదు పట్టుబడుతుండటం గమనిస్తే మోడీ చెప్పిన ఆ ఆశయం నెరవేరలేదని స్పష్టం అవుతోంది. వారు కూడా అందరితోబాటు తమ వద్ద ఉన్నా పాత నోట్లను వదిలించుకొని కొత్తనోట్లు దాచుకొన్నారు. 

ఇటువంటి అవినీతి అధికారులు, రాజకీయ నేతల వద్ద ఈవిధంగా పోగుపడిన కొత్తనోట్లను వెలికితీసే ప్రయత్నం చేయకుండా, నోట్లకొరతను అధిగమించడానికి రిజర్వ్ బ్యాంక్ కొత్తగా రూ.200 నోట్లను ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ నోట్ల ముద్రణాలయంలో ఈ రూ.200 నోట్ల ముద్రణ మొదలుపెట్టారు. వాటికి నకిలీలు చేయకుండా అనేక భద్రతాప్రమాణాలతో ముద్రిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే చిల్లర కొరత తీరుతుందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. 

అయితే అత్యంత బద్రతాప్రమాణాలున్నాయని చెప్పుకొంటున్న కొత్తగా ముద్రించిన రూ.500, 2,000 నోట్లకే దేశంలో అప్పుడే నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చేసినప్పుడు, ఈ రూ.200 నోట్లకు నకిలీలు తయారు చేయలేరనుకొంటే అవివేకమే. అలాగే ఇవి కూడా అవినీతిపరులు, రాజకీయ నేతల లాకర్లలోకి వెళ్ళిపోవనే నమ్మకం ఏమిటి? ప్రతీ ఆరు నెలలకు ఈవిధంగా కొత్తనోట్లు ముద్రిస్తుంటే, నకిలీ నోట్లను ముద్రించేవారు కూడా రేపు రూ.250, 300, 400 నోట్లను ముద్రించి మారుమూల గ్రామాలలో చలామణిలోకి తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదు. రోగం ఒకటయితే మందు మరొకటి అన్నట్లు సాగుతోంది ఈ కొత్తనోట్ల ముద్రణ వ్యవహారం.


Related Post