వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవకాశం చిక్కినప్పుడల్లా త్వరలో తనే ఏపికి ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పుకొంటారు. ఆ పార్టీ నేతలు మరో అడుగు ముందుకు వేసి ఏపి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సిఎం చేద్దామా అని కళ్ళు కాయలు కాసేలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారని చెపుతూ తమ అధినేతని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వైకాపాతో ఎటువంటి సంబంధమూ లేని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డికి డప్పు కొట్టడం విశేషం.
అనంతపురం జిల్లాలో ఆయన మొన్న మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు పాలనతో రాష్ట్ర ప్రజలు చాలా విసుగెత్తిపోయున్నారు. తెదేపా నేతల అవినీతి, అహంకారం ప్రజలు భరించలేకపోతున్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. విశాఖ భూకుంభకోణంలో తెదేపా నేతల ప్రమేయం ఉన్నట్లు ఐవైఆర్ కృష్ణారావు వద్ద సమాచారం ఉంది. రానున్న రోజులలో నేను ఆయనతో కలిసి తెదేపా నేతల అవినీతిపై పోరాటం మొదలుపెడతాను. వచ్చే ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్నప్పటికీ అది మరో మూడు నాలుగేళ్ళలోగా పూర్తయ్యే అవకాశం లేదు. తెదేపా తరువాత అధికారంలోకి రాబోయే జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వమే దానిని పూర్తిచేయవలసి వస్తుంది,” అని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్ళు పూర్తయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఇంకా రాష్ట్ర విభజన జరుగలేదని వితండవాదం చేస్తుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి రావలసిన ప్రయోజనాల గురించి పోరాడకుండా, రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసినప్పటికీ దానిని అడ్డుకోనేందుకే పోరాడి, చివరికి తెలివిగా రాజీనామా చేసేసి రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయినా రాజకీయ వాసనలు మాత్రం వదలటం లేదు. అందుకే జగన్ కు వంత పాడుతున్నట్లున్నారు.