జి.ఎస్.టి. ప్రారంభోత్సవానికి ఆ పార్టీ కూడా డుమ్మా!

June 29, 2017


img

రేపు అంటే జూన్ 30వ తేదీ అర్ధరాత్రి డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇతర కేంద్రమంత్రులు, ఎంపిలు, ఎన్డీయే సభ్య పార్టీల నేతలు, ఇంకా అనేక మంది ప్రముఖుల సమక్షంలో జి.ఎస్.టి. విధానాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి అన్ని ప్రముఖ పార్టీల నేతలను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. కానీ జి.ఎస్.టి.ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హాజరుకాబోనని ముందే ప్రకటించారు. మోడీ సర్కార్ అనాలోచితం సృష్టించిన ఆ జి.ఎస్.టి. వలన రానున్న రోజులలో దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోబోతోందని, కానీ అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్లు భావిస్తూ మోడీ సర్కార్ నిర్వహించబోతున్న ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని నిర్ద్వందంగా మమతా బెనర్జీ ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నట్లు ప్రకటించింది. 

జి.ఎస్.టి. బిల్లులో కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించాయి. వాటిపై చాలా రోజులపాటు అధికార,   ప్రతిపక్షపార్టీల మద్య ప్రతిష్టంభన ఏర్పడింది. చివరికి కాంగ్రెస్ సూచించిన కొన్ని సవరణలు చేయడం ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. ఆ తరువాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్దికమంత్రులు జి.ఎస్.టి. కౌన్సిల్ సమావేశాలలో పాల్గొని జి.ఎస్.టి. అమలుప్రక్రియపై విస్తృతంగా చర్చించారు కూడా. ఒకవేళ అది జి.ఎస్.టి.ని వ్యతిరేకిస్తున్నట్లయితే మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలాగ వ్యతిరేకించి ఉండి ఉంటే, ఇప్పుడు మొహం చాటేసినా ఎవరూ వేలెత్తి చూపి ఉండేవారు కాదు. కానీ ఆఖరు నిమిషం వరకు జి.ఎస్.టి. కౌన్సిల్ చర్చలలో కూడా పాల్గొని ఇప్పుడు మొహం చాటేస్తోంది.

జి.ఎస్.టి.లో మంచి చెడ్డలు, దాని వలన మున్ముందు కలుగాబోయే లాభనష్టాలను పక్కన పెడితే, ఎవరు అవునన్నా కాదన్నా దానిని అమలుచేయడం దేశంలో ఒక చారిత్రాత్మక సంఘటన అని చెప్పకతప్పదు. అటువంటి గొప్ప కార్యక్రమానికి హాజరుకాకపోవడం వలన కాంగ్రెస్ పార్టీయే దేశ ప్రజల దృష్టిలో చులకన అవుతుంది. 


Related Post