ఇక్కారెడ్డిగూడ గ్రామంలో బోరుబావిలో పడి చిన్నారి మృతి చెందిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. జూలై 10వ తేదీలోగా రాష్ట్రంలో నీళ్ళుపడని అన్ని బోరుబావులను పూడ్చివేయడం లేదా మూతలు బిగించాలని లేకుంటే సదరు యజమానులపై కేసులు నమోదు చేసి రూ.50,000 వరకు జరిమానాలు కూడా విధిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
బోరుబావుల త్రవ్వకాలను నియంత్రించవలసిన అవసరం చాలా ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. ఎవరూ చొరవ తీసుకోకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కానీ ముందుగా ఆ సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా రైతులు అప్పులు చేసి మరీ వరుసగా బోరుబావులు త్రవ్వించుకొంటున్నారు. వాటిలో కూడా నీళ్ళు పడకపోవడం చేత అప్పులపాలైన అనేకమంది రైతులు నిరాశానిస్ప్రహలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. వారు త్రవ్వించిన బోరుబావులను పూడ్చకుండా, మూతలు బిగించకుండా అలాగే వదిలివేయడంతో అవి చిన్నారుల పాలిట మృత్యుకూపాలుగా మారుతున్నాయి.
కనుక ప్రభుత్వం బోరుబావులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకోకుండా, ఈ సమస్యలకు మూలకారణమైన భూగర్భజలాలను పెంచడానికి నిపుణుల సలహాలతో తగిన చర్యలు సమాంతరంగా చేపట్టడం కూడా చాలా అవసరం.
నీళ్ళుపడని బోరుబావులన్నిటినీ మూసివేయడమే మంచిదని అందరూ భావిస్తున్నప్పటికీ, రీచార్జింగ్ చేసుకోగలిగితే వాటిలో అనేక బావులలో నీళ్ళు పడవచ్చని భూగర్భజలాల నిపుణుడు సుబాష్ రెడ్డిగారు నమ్మకంగా చెపుతున్నారు. తద్వారా వాటిపై పెట్టుబడి పెట్టిన సదరు రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెపుతున్నారు. కనుక తెరిచి ఉంచిన బోరుబావులను అనాలోచితంగా పూడ్చిపెట్టడంకంటే వాటికి మూతలు బిగించి లేదా వాటిపై బరువైన బండరాయి పెట్టి లేదా వాటి చుట్టూ ముళ్ళ కంపలు వేసి తాత్కాలికంగా మూసివేసి, తమవంటి జలవనరుల నిపుణుల చేత పరీక్షలు నిర్వహింపజేసినట్లయితే వాటిలో మళ్ళీ వినియోగంలోకి తీసుకురాగల బావులను గుర్తించి, వాటిని రీచార్జింగ్ చేసి అందించగలమని సుబాష్ రెడ్డి చెపుతున్నారు.
సుమారు రూ.75,000-1,50,000 ఖర్చు చేసి త్రవ్వించిన బోరుబావులను అనాలోచితంగా మూసివేయడం కంటే వాటిలో కొన్నిటినైనా మళ్ళీ వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం వలన అటు రైతులకు, ప్రభుత్వానికి కూడా మేలు కలుగుతుందని సుబాష్ రెడ్డి చెపుతున్నారు. ముఖ్యంగా సమీపంలో జలవనరులు ఉన్న ప్రాంతాలలో బోరుబావులను రీ-చార్జింగ్ చేసే అవకాశాలు ఎక్కువని చెపుతున్నారు.
అసలు జలవనరులు లేని హైదరాబాద్ నగరంలో అపార్ట్ మెంటు పైకప్పుల కురిసిన వాననీటిని రివర్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానం ద్వారా భూమిలోకి ఇంకించడం ద్వారా అనేక బోరుబావులను మళ్ళీ రీ ఛార్జ్ చేయగలిగామని సుబాష్ రెడ్డి చెపుతున్నారు. కనుక గ్రామాలలో నీళ్ళు పడని బోరుబావులను కూడా ఒకసారి పరిశీలించిన తరువాత మూసి వేయడం మంచిదని సూచిస్తున్నారు. ఇది వర్షాకాలం కనుక భూగర్భజలాలను పెంచుకోవడానికి ఇదే తగిన సమయమని ఈ సువర్ణావకాశాన్ని వదులుకొంటే మళ్ళీ వచ్చే వేసవిలో ఇవే పరిస్థితులు పునరావృతం కాకమానవని హెచ్చరిస్తున్నారు.
సుభాష్ రెడ్డిగారి సేవలు, సలహాలు, సూచనలు కావలసిన వారు 09440055253 ఫోన్ నెంబర్ లో లేదా saverainwater@gmail.com ఆయనను స్పంప్రదించవచ్చు.