మళ్ళీ చాలా రోజుల తరువాత బిహార్ వార్తలలోకి వచ్చింది. అందుకు కారణం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జెడియు, ఆర్.జె.డి.పార్టీల అధినేతల మద్య దూరం పెరగడమే.
బిహార్ ప్రభుత్వంలో ఆర్.జె.డి. అధినేత లాలూ ప్రసాద్ కుమారులు ఇద్దరూ మంత్రులుగా ఉన్నారు. వారుకాక మరికొంతమంది కూడా మంత్రులుగా ఉన్నారు. వారందరితో నితీష్ కుమార్ నిత్యం అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటున్నట్లు తరచూ వార్తలు వస్తుంటాయి. నితీష్ కుమార్ తన శైలిలో బిహార్ ను అభివృద్ధిపధంలో నడిపించేందుకు ప్రయత్నిస్తుంటే లాలూ అండ్ కో ఆయనకు బ్రేకులు వేస్తుంటారు.
అందుకే ఆయన మళ్ళీ భాజపాతో స్నేహానికి సిద్దపడుతున్నారు. అదే సమయంలో ఈడి, ఆదాయపన్నుశాఖలు లాలూ కుటుంబ సభ్యులపై అక్రమాస్తులను త్రవ్వి తీస్తూ వారిపై కేసులు పెట్టసాగాయి. భాజపాతో నితీష్ కుమార్ స్నేహానికి సిద్దపడటమే అందుకు కారణమని లాలూ భావిస్తుండటంతో వారి మద్య దూరం ఇంకా పెరిగింది.
ఈ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. నితీష్ కుమార్ వాటిని తెలివిగా ఉపయోగించుకొంటూ భాజపా అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు బేషరతు మద్దతు పలికారు. అందుకు లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయన ఖాతరు చేయకపోవడం వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక నేడో రేపో లాలూ అండ్ కో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడం ఖాయం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. వాటిలో లాలు అండ్ కోకు 80 మంది, నితీష్ కుమార్ కు 71 మంది, భాజపాకు 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం నిలబడేందుకు కనీసం 122 మంది అవసరం. ఒకవేళ లాలూ అండ్ కో బయటకు వెళ్ళిపోతే నితీష్ కుమార్ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. భాజపా ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 124 మంది అవుతారు. కనుక లాలూ వెళ్ళిపోయినా నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. కానీ అధికారం వదులుకోవడానికి ఇష్టపడక వారు బయటకు వెళ్ళకపోతేనే నితీష్ కుమార్ కు ఇబ్బంది. వారిని అయిష్టంగానైనా భరించవలసి వస్తుంది.