ముఖ్యమంత్రి కేసీఆర్ పదవికి, తెరాసకి వారసుడు మంత్రి కేటిఆరేనని ఎవరికీ బొట్టు పెట్టి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ మద్యన కొన్ని రోజులు ఆయనే వారసుడనే విషయం అందరికీ తెలిపేందుకు తెరాసలో కొందరు ప్రముఖ నేతలు పనిగట్టుకొని వ్యాఖ్యలు చేసి వాటిపై మీడియాలో చర్చలు, విశ్లేషణలు, ఊహాగానాలు వగైరా మొదలయ్యేలా చేశారు. ఆ సమయంలో కొందరు తెరాస నేతలు కేటిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నట్లు మాట్లాడారు. మీడియాలో ఆ చర్చలు పతాకస్థాయి చేరుకొన్నాక కేటిఆర్ స్వయంగా రంగప్రవేశం చేసి తనకు అటువంటి ఆలోచనలు ఏవీ లేవని, మరో 20-30 ఏళ్ళ వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పి ఆ చర్చలకు ముగింపు పలికారు. ఆ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోరని మరోమాట జోడించడంతో మీడియా చర్చ దానిపైకి డైవర్ట్ అయ్యింది. అది వేరే విషయం.
కానీ అప్పటి నుంచి మళ్ళీ కేటిఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం గురించి అటు తెరాసలోను, ఇటు మీడియాలోను ఎక్కడా చర్చ జరుగలేదు. అంటే కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనుకొంటే జనం ఏవిధంగా స్పందిస్తారనే ఉద్దేశ్యంతోనే తెరాస ఆ అంశాన్ని హైలైట్ చేసిందా? జనాభిప్రాయం పాజిటివ్ గానే ఉంది కనుక ఇప్పుడు దానిపై ఇక చర్చ అవసరం లేదనే ఉద్దేశ్యంతో ఆ ఊసు ఎత్తడం మానుకొందా? అనే సందేహం కలుగుతుంది.
అయినా రాజకీయాలలో 60 ఏళ్ళు వయసు అంటే పెద్ద వయసేమీ కాదు కనుక వచ్చే ఎన్నికలలో గెలిచినట్లయితే కేటిఆర్ చెప్పినట్లు 20-30 ఏళ్ళు కాకపోయినా 2024 ఎన్నికల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. అదే తెరాసకు కేటిఆర్ రాజకీయ భవిష్యత్ కు కూడా అన్నివిధాల మంచిదని భావించబట్టే కేటిఆర్-ముఖ్యమంత్రి పదవి చేపట్టడమనే చర్చను తెరాస అర్ధాంతరంగా నిలిపివేసి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నట్లయితే ఏదో ఒకరోజు కేటిఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి అవుతారనే దానిలో ఎవరికీ భినాభిప్రాయలు లేవు.