హైదరాబాద్ లో నగరప్రజలకు కేవలం ఒక్క రూపాయికే శుద్ధిచేసిన మంచినీళ్ళు అందించడానికి జి.హెచ్.ఎం.సి. ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ మొదటివారం నుంచి నగరంలో 15 ప్రధాన ప్రాంతాలలో వాటిని ప్రారంభించడానికి టెండర్లు పిలిచింది.
ప్రస్తుతం నగరంలో ఒక్క లీటర్ నీళ్ళ బాటిల్ కనీసం రూ.20 ఉంది. అంత ధర పెట్టి కొనుకోలేని సామాన్య ప్రజలు మూడు రూపాయలకు దొరికే 200 ఎం.ఎల్ నీళ్ళ ప్యాకెట్లను కొనుకొని త్రాగుతున్నారు. అయితే వాటి శుద్దతపై పలు అనుమానాలున్నాయి. ఇక నగరమంతటా మంచినీళ్ళ క్యానుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. 20 లీటర్ల నీళ్ళ క్యానుకు రూ.50-75 వరకు వసూలు చేస్తున్నారు. వాటి నాణ్యతపై కూడా అనుమానాలున్నాయి.
200 ఎం.ఎల్ నీళ్ళ ప్యాకెట్లను రూ.3కు అమ్ముతున్నప్పుడు, లీటరు నీళ్ళను ఒక్క రూపాయికే ఇవ్వడం సాధ్యమేనా? ఎవరైనా ముందుకు వస్తారా? వచ్చినా ఎంతకాలం ఉంటారు? అనే అనుమానం ఉంది.
ఇక రూ.5 భోజనం సరఫరాతోనే జి.హెచ్.ఎం.సిపై చాలా ఆర్దికభారం పడింది. ఇప్పుడు ఈ నీళ్ళ సరఫరాను కూడా తలెకెత్తుకొంటే మోయగలదా? అనే అనుమానం కూడా ఉంది. నగరంలో రోడ్లు, కాలువలు, వీధి దీపాల మరమత్తులు చేయలేక ఆపసోపాలు పడుతున్న జి.హెచ్.ఎం.సి.పై ఈ అదనపు పని, ఆర్దికభారం మోపడం ఎంతవరకు సమంజసం? అని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేందుకే ప్రత్యేకంగా సంక్షేమ శాఖ ఒకటి ఉంది కనుక దానికే ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది కదా!