మంత్రి కేటిఆర్ తదితరులు అప్పుడప్పుడు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సహకరించడం లేదని, రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శిస్తుంటారు. కానీ మళ్ళీ వారే డిల్లీ వెళ్ళినప్పుడు కేంద్రం అన్ని విధాల రాష్ట్రానికి సహాయసహకారాలు అందిస్తోందని, తమ అభ్యర్ధనలన్నిటికీ సానుకూలంగా స్పందిస్తోందని చెప్పుకొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది మరోసారి నిరూపితం అయ్యింది.
ప్రస్తుతం డిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా 3,168 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకోవడానికి అనుమతినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఆ ప్రాజెక్టు విషయంలో కేంద్రం అందిస్తున్న సహాయసహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల చేయాలనే కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని డిల్లీలో తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియాకు తెలిపారు. మూడవ విడత హరితహారంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఆయనను ఆహ్వానించారని, కేంద్రమంత్రి ఆయన ఆహ్వానాన్ని మన్నించారని తెలిపారు.
గతంలో మంత్రి కేటిఆర్ డిల్లీ వెళ్ళి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడు ఆయన కూడా ఇలాగే సానుకూలంగా స్పందించారు. ఆ విషయం ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత గొప్ప సహకారం కనిపించలేదు. కానీ ఇప్పుడు తెరాస, భాజపాలు రాజకీయంగా విభేధించుకొంటున్నప్పటికీ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తోంది. అయినా తెరాస నేతలు మళ్ళీ కేంద్రంపై విమర్శలు గుప్పించడం దేనికో?