రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ అనివార్యం అవడంతో ఎన్డీయే, యూపియే కూటమి నేతల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. ఎన్డీయే అభ్యర్ధిగా రాంనాథ్ కోవింద్ ను నిలబెట్టినప్పుడు భాజపా అత్యుత్సాహంతో ఒక తప్పు చేసింది. తమ పార్టీ దళితులకు చాలా గౌరవం ఇస్తుంది కనుకనే దళితవ్యక్తిని అభ్యర్ధిగా నిలబెట్టామని గొప్పగా చెప్పుకొంది. తమ దళిత అభ్యర్ధికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయో లేదో తేల్చుకొమన్నట్లు మాట్లాడింది. తద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనుకొంది. కానీ అదే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.
ఒకపక్క దేశంలో గోరక్షక్ ల పేరుతో నిత్యం దళితుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకొని భాజపా, దళితుడిని రాష్ట్రపతి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, అది రాజకీయ ఎత్తుగడే తప్ప దళితుల మీద ప్రేమ కాదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. భాజపా తన స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను కులాలు, మతాల వారిగా చీల్చుతోందని అటువంటి మతతత్వ పార్టీకి మద్దతు ఇవ్వడం సరికాదని తెలంగాణా పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఆర్.ఎస్.ఎస్. మూలాలున్న రాంనాథ్ కోవింద్ వంటి వ్యక్తి రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈవిధంగా దళితవ్యక్తిని లేదా హిందువును రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టడం దేశానికి చాలా ప్రమాదం అని వాదిస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాలు కూడా దళిత అభ్యర్ధి మీరా కుమార్ ని పోటీలో నిలబెట్టడం విశేషం. రాష్ట్రపతి ఎన్నికలలో కులం, మతం ప్రస్తావన వద్దంటూనే ప్రతిపక్షాలు కూడ మళ్ళీ అదే పని చేశాయి. ఎన్డీయే తన అభ్యర్ధిని నిలబెట్టడమే నేరం అన్నట్లు మాట్లాడుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవంగా జరగాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రులు స్వయంగా సోనియా గాంధీ, ప్రతిపక్ష నేతల వద్దకు వచ్చి వారి సహకారం అర్ధించినా ఎవరూ సహకరించలేదు. ఎందుకంటే ఈ ఎన్నికలలో తమ అభ్యర్ధిని బరిలోకి దింపాలని ప్రతిపక్షాలు ముందే నిర్ణయించుకొన్నాయి. ప్రతిపక్షాల ఐక్యతను, శక్తిని చాటడం కోసమే ఈ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాయి తప్ప ఈ ఎన్నికలలో తమ అభ్యర్ధి గెలుస్తారనే నమ్మకంతో కాదు. ప్రజల మద్య భాజపా చీలికలు సృష్టిస్తున్నాయని వాదిస్తున్న కాంగ్రెస్, మిత్రపక్షాలు కూడా ఈ సాకుతో ప్రజల మద్య చీలికలు సృష్టిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాయి.