అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మద్య వైట్ హౌస్ లో నిన్న జరిగిన సమావేశంలో భారత్ కోరుతున్న అత్యాధునిక 22 డ్రోన్లను సరఫరా చేసేందుకు ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకరించారు. భారత్ పట్ల అకారణ ద్వేషం ప్రదర్శిస్తున్న చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దులు పంచుకొంటున్న భారత్ కు సరిహద్దులపై నిఘా పెట్టడానికి అవి చాలా అవసరం. అందుకే భారత్ కు అవి ఆర్ధికంగా చాలా బారం అయినప్పటికీ కొనుగోలు చేయవలసి వస్తోంది. వాటి కోసం అది అమెరికాకు చెల్లించబోయే మొత్తం 2 బిలియన్ డాలర్లు. నిజానికి భారత్ కు యుద్ధవిమానాలు అమ్మాలని అమెరికా అనుకొన్నప్పటికీ ఆ డీల్ ను ఫ్రాన్స్ ఎగరేసుకువెళ్ళిపోయింది. కనుక ఈ బారీ ఒప్పందంతో అమెరికాను సంతృప్తిపరిచే ప్రయత్నం చేసినట్లు కూడా భావించవచ్చు.
ఈ భేటీలో రెండు దేశాలలో దేనికి ఎక్కువ ప్రయోజనం కలిగిందని చూసినట్లయితే అమెరికాకు $2 బిలియన్లు బిజినెస్ జరుగగా, భారత్ కు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ విషయంలో భారత్ కు అమెరికా సహాయసహకారాలు చాలా అవసరం. పాక్ ను నియంత్రించడం భారత్ వల్ల కాని పని అని తేలిపోయింది కనుక దానికి ఆర్ధిక సహాయం అందిస్తున్న అమెరికా ద్వారా మోడీ పాక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.
ఇక ఇంతవరకు పాకిస్తాన్ ఒక్కటే భారత్ కు పక్కలో బల్లెంలా ఉండేది. కానీ ఇప్పుడు చైనా కూడా భారత్ కు పదేపదే సవాలు విసురుతోంది. నిజానికి చైనా ఎప్పటి నుంచో అదేవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆ సంగతి ఇంతకాలం పెద్దగా బయటపడలేదు. సోనియా గాంధీ కనుసన్నలలో పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చైనాను దూకుడును పెద్దగా పట్టించుకోకపోవడం వలన అప్పుడు ఆ సమస్య తీవ్రత ఎవరికీ తెలిసేది కాదు. కానీ మోడీ అధికారంలోకి వచ్చేక చైనా దుందుడుకు చర్యలను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నందున చైనా కుట్రలు బహిర్గతం అవుతున్నాయి. కనుక చైనాను కట్టడిచేయడానికి భారత్ కు అమెరికా వంటి అగ్రరాజ్యం సహాయసహకారాలు చాలా అవసరం. దానికి మోడీ-ట్రంప్ స్నేహం చాలా ఉపయోగపడవచ్చు.