టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈ నెల 21 నుంచి 24 వరకు సంగారెడ్డి నుంచి సిద్ధిపేట వరకు అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. కేసీఆర్ ఇలాకాలో జరిపిన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. తెరాస సర్కార్ వారిలో వ్యతిరేకత నెలకొని ఉన్నట్లు తను గమనించానని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, రైతులు, ఉద్యోగులలో తెరాస సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తి కనబడిందని చెప్పారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న చాలా పధకాలు అర్హులైన ప్రజలకు చేరడంలేదని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మళ్ళీ త్వరలోనే సిరిసిల్లా నుంచి రెండవ విడత యాత్రను చేపట్టబోతున్నట్లు చెప్పారు. దాని తేదీలు రూట్ మ్యాప్ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
ప్రొఫెసర్ కోదండరామ్ చెపుతున్న మాటలలో వాస్తవం ఉందనే సంగతి తెరాస నేతలకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్తగా ఏదో ఒక పధకం ప్రకటిస్తుంటారు. కానీ ఆయన చెప్పినట్లుగా అది అమలులోకి రావడం లేదనే పిర్యాదులు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా బహిరంగ సభలో మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త పధకాల గురించి సామాన్య ప్రజలకు సైతం చక్కగా అర్ధంయ్యేలాగ వివరిస్తుంటారు. ఇది వరకు ఎవరూ చేయలేని పనిని తాము చేసి చూపిస్తున్నామని చెపుతుంటారు. ఆ పధకం నేడో రేపో అమలుచేయబోతున్నట్లు చెపుతుంటారు. ఆయన మాటలు విన్నప్పుడు ఆయా వర్గాల ప్రజలలో సహజంగానే ఆ పధకాలు తమకు అందబోతున్నాయని గట్టిగా నమ్ముతారు.
కానీ వాటి అమలులో ఆలస్యం జరుగుతుంది. ఉదాహరణకు గర్భిణి స్త్రీలకు కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పధకం వంటి పధకాల అమలు చాలా సంక్లిష్టమైనవి. వాటి కోసం ఆ వస్తువులు, జీవాల కొనుగోలు ప్రక్రియ మొదలు లబ్దిదారులను ఎంపిక చేసి వారికి సకాలంలో అందజేయడం వరకు అనేక ప్రభుత్వ శాఖలు పరస్పర అవగాహనతో పనిచేసినపుడే సాధ్యం అవుతుంది. ఇక వాటిలో అవినీతి, రాజకీయాలు, అసమర్ధత చోటుచేసుకోవడం కూడా సహజమే. కనుక కేసీఆర్ ప్రకటిస్తున్న ఆకర్షణీయమైన పధకాలు అర్హులైన లబ్దిదారులకు చేరకపోవచ్చు లేదా ఆలస్యం జరుగవచ్చు. అప్పుడు వాటి కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై అపనమ్మకం ఏర్పడవచ్చు. ప్రొఫెసర్ కోదండరామ్ యాత్రలో అదే బయటపడుతోంది. కనుక పధకాలను ఆర్భాటంగా ప్రకటించడమే కాకుండా వాటి అమలుకు కూడా ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. లేకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ చెపుతున్నట్లుగా ప్రభుత్వం పట్ల ప్రజలలో అపనమ్మకం పెరుగవచ్చు.