ఇక్కారెడ్డిగూడ గ్రామంలో చిన్నారి పాప బోర్ వెల్ లో పడిపోయినప్పుడు, తెలుగు టీవీ ఛానల్స్ అన్నీ అక్కడి పరిణామాలను కవరేజ్ చేస్తూ దానికి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు, ఇంటర్వ్యూలకే మూడు రోజులు పూర్తిగా అంకితమయిపోయాయి.
ఇటువంటి సందర్భాలలో కొంచెం అతిగా వ్యవహరించే కొన్ని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్స్ ఆ పాప తరపున, తల్లితండ్రుల తరపున ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా పైత్య కవిత్వం కూడా ఒలకబోసాయి. అక్కడితూ ఆగకుండా గ్రాఫిక్స్ సహాయంతో ఆ పాప బోరుబావిలో ఏవిధంగా పడిపోయిందో పదేపదే చూపించింది. తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్న ఆ పాప తల్లిని ఇంటర్వ్యూ చేయడమే కాకుండా పదేపదే ఆమెను టీవీలో చూపించాయి.
ఆ పాప బోరుబావిలో పడి చనిపోయినందుకు ప్రజలందరూ చాలా బాధపడారు. కానీ ఆ టీవీ ఛానల్స్ చేసిన ఈ అతి అంతకంటే భయంకరంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో మంచి ఆదరణ పొందుతున్న ఆ టీవీ ఛానల్స్ ఇటువంటి దురదృష్టకర సంఘటనలో కూడా తమ రేటింగ్స్ పెంచుకోనేందుకు అంతగా ప్రాకులాడవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు.
ఒకవేళ ఆ ఛానల్స్ యాజమాన్యాలు నిజంగానే ఆ సంఘటనపై అంతగా కదిలిపోయుంటే, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రజలను, ప్రభుత్వాన్ని చైతన్య పరిచేవిధంగా ఏవైనా కార్యక్రమాలు ప్రసారం చేసి ఉండి ఉంటే ఉపయోగం ఉండేది కదా!
ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ కూడా తెరిచి వదిలేసిన బోర్ వెల్స్ గురించి మాట్లాడటం లేదు. అన్నీ ఆ ‘బోర్ వెల్’ కార్యక్రమాన్ని పక్కనపడేసి, సినీనటుడు భరత్ కారు యాక్సిడెంట్ కేసు, శిరీష ఆత్మహత్య కేసులను భుజానికి ఎత్తుకొని వాటి గురించి సుత్తి మొదలుపెట్టాయి. అంటే ఆ మూడు రోజులు వాటికి వేరే ఆసక్తికరమైన అంశమేదీ దొరకనందునే ఈ 'బోర్ వెల్' కార్యక్రమం పట్టుకొన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. నేటికీ రాష్ట్రంలో వేలాది ఓపెన్ బోర్ వెల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. అంటే ఇకపై ఎన్నడూ వాటి వలన ప్రమాదాలు జరుగవని అవి భావిస్తున్నాయనుకోవాలా?
దీనిని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే మీడియాకు ఆసక్తి ఉన్నంతవరకే ఏ విషయమైనా ప్రాముఖ్యత సంతరించుకొంటుంది. దానికి ఆసక్తి ఉన్న అంశాలనే ప్రజలకు చూపిస్తుంది. వాటి రేటింగ్ పెరిగేందుకు ఉపయోగపడే మరో మసాలా ఐటెం దొరకగానే, సర్కస్ లో ఉయ్యాల ఫీట్స్ చేసేవారిలాగ పాత అంశాలను పక్కనపడేసి కొత్తవాటికి షిఫ్ట్ అయిపోతాయని స్పష్టం అవుతోంది. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా బోర్ వెల్ లో పసిపిల్లలు పడిపోయినప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులతో బాటు మీడియా కూడా రెడీ అయిపోతుంది. అంతే తప్ప ఈ సమస్యను పరిష్కరించేవరకు కృషి చేయడానికి వాటికి సమయం, ఆసక్తి రెండూ లేవని అర్ధం అవుతోంది. అయితే మీడియా పట్టించుకొన్నా..పట్టించుకోకపోయినా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టినట్లయితే మళ్ళీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.