కాంగ్రెస్, మిత్రపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీకి దిగిన మీరా కుమార్ మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి డిల్లీ వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి మియాపూర్ భూకుంభకోణం వ్యవహారంలో తెరాస సర్కార్ పై పిర్యాదు చేయబోతున్నారు.
అయితే తమ రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు తెరాస మద్దతు ఇస్తున్నప్పుడు దానిపై కాంగ్రెస్ నేతలు చేసే పిర్యాదును కేంద్రం పట్టించుకొంటుందనుకోలేము.
భాజపా-తెరాసలు పైకి శత్రువులులాగ నటిస్తున్నా వాటి మద్య రహస్య అవగాహన ఉందని, ఇటువంటి కీలక సమయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాకు బేషరతుగా మద్దతు ఇస్తుండటం గమనిస్తే అది అర్ధం అవుతుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని వాదిస్తున్నప్పుడు వారు హోంమంత్రికి పిర్యాదు చేసి ఏమి ప్రయోజనం?
ముస్లిం రిజర్వేషన్ల అంశంలో పరస్పరం కత్తులు దూసుకొన్న తెరాస-భాజపాలు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో చేతులు కలిపి మిత్రపక్షాలలాగ వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇప్పుడు రాష్ట్ర భాజపా నేతలు ఎవరూ ఇదివరకులాగ తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించడం లేదు. ఈ విషయం కాంగ్రెస్ నేతలు కూడా గ్రహించే ఉంటారు. తమ పిర్యాదుపై కేంద్రం స్పందించదని వారికీ తెలుసు. బహుశః వారు కూడా అదే కోరుకొంటున్నారని చెప్పవచ్చు. వారు హైదరాబాద్ తిరిగివచ్చిన తరువాత, ఇదే విషయం ప్రస్తావించి తెరాస-భాజపాల మద్య రహస్య అవగాహన ఉందని చెప్పడానికి ఇదే మరో నిదర్శనమని విమర్శలు గుప్పించవచ్చు.
అయితే సాధారణంగా ఇటువంటి వ్యవహారాలలో కేంద్రం చాలా అరుదుగా జోక్యం చేసుకొంటుందని అందరికీ తెలిసిందే. ఒకవేళ మున్ముందు తెరాస మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ల అంశం గురించి కేంద్రంపై ఒత్తిడి చేసినప్పుడు ఈ కుంభకోణం గురించి రాష్ట్ర భాజపా నేతలు గట్టిగా మాట్లడుతారేమో! అంతకు మించి ఏమీ జరిగే అవకాశం లేదు. ఒకవేళ మున్ముందు తెరాస-భాజపాలు ఎన్నికల పొత్తులకు సిద్దపడితే ఇక ఆ ప్రస్తావనే రాదని వేరే చెప్పనవసరం లేదు.