ప్రొఫెసర్ ఐ. తిరుమలి చైర్మన్ గా, పి.ఎల్. విశ్వేశరరావు కన్వీనర్ గా 27 మంది సభ్యులతో కూడిన తెలంగాణా మేధావుల ఫోరం ఆదివారం ఏర్పాటయింది. వివిధరంగాలకు చెందిన మేధావులతో కూడిన ఈ ఫోరం రాష్ట్రంలో వివిధ సమస్యలపై చర్చించి ప్రజలను చైతన్యపరుస్తుంది. అలాగే సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. ఈ ఫోరంలో కంచ ఐలయ్య, జాడి ముసలయ్య, బూక్యా భాంగ్యా, జస్టిస్ చంద్రకుమార్, డాక్టర్ బీవీ రాఘవులు, డాక్టర్ గోపీనాథ్, అబ్దుల్ వాహిద్, బాలబోయిన సుదర్శన్, పట్టా వెంకటేశ్వర్లు, అరిబండి ప్రసాదరావు, బీ సుదర్శన్‌రావు, హిమబిందు, దేవి, పాశం యాదగిరి, మాదాల రవి తదితరులు సభ్యులుగా ఉంటారు.
నిజానికి వివిధరంగాలకు చెందిన మేధావులతో కూడిన ఇటువంటి ఫోరం ఏర్పాటు చాలా అవసరమే. ఈ ఫోరం తెలంగాణా ప్రభుత్వంతో చక్కగా అనుసంధానం అయినట్లయితే వారి సలహాలు ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ ఫోరం ఏర్పాటు సందర్భంగా వారు చేసిన ప్రసంగాలలో ప్రభుత్వ వ్యతిరేకతే ఎక్కువగా కనబడింది. తెరాస సర్కార్ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అది దళిత, బడుగు, బలహీన, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని కనుక దానిని గట్టిగా ఎదుర్కోవాలని వక్తలు అభిప్రాయలు వ్యక్తం చేశారు. ఎవరూ కూడా తెరాస సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై లోతుగా చర్చించలేదు...వాటి మంచి చెడ్డల గురించి పెద్దగా మాట్లాడలేదు.
అంటే ప్రభుత్వం పట్ల వారిలో నెలకొన్న వ్యతిరేకతే ఈ ఫోరం ఏర్పాటుకు కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలను, అది చేస్తున్న పనులను విమర్శించడానికైతే రాష్ట్రంలో ప్రతిపక్షాలున్నాయి. ఆ మేధావుల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న ప్రజా సంఘాలున్నాయి. ఇక మీడియా ఉండనే ఉంది. కనుక మేధావుల ఫోరం ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం కాకుండా దానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే దానిని స్థాపించిన ప్రయోజనం నెరవేరుతుంది.