మూడేళ్ళ మోడీ పాలనలో అవినీతి ఆరోపణలు రానప్పటికీ దేశప్రజలపై బలవంతంగా హిందుత్వం రుద్దాలని చేస్తున్న ప్రయత్నాలను అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఒక పార్టీ సిద్దాంతాలు దేశ ప్రజలందరికీ నచ్చాలని నియమం ఏమీ లేదు. అయినా తమ భాజపా సిద్దాంతాలను, భావజాలాన్ని అంగీకరించనివారందరూ దేశాద్రోహులే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు, మంత్రులు వాదిస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి కేంద్రంలో తన అధికారం నిలబెట్టుకొనేందుకు, అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించి అధికారంలోకి తీసుకువచ్చేందుకు భాజపా హిందుత్వాన్ని ఒక బలమైన ఆయుధంగా నమ్ముతున్నట్లుంది. అయితే అదే దాని బలహీనత అని భావిస్తున్న విపక్షాలు సెక్యులరిజంను ఆయుధంగా చేసుకొని కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో అవినీతి దేశప్రజలను భాజపావైపు మొగ్గు చూపేలా చేస్తే, ఇప్పుడు తమ హిందుత్వ పిడివాదనలు ప్రతిపక్షాలన్నీ ఏకత్రాటిపైకి వస్తున్నాయని భాజపా గ్రహించినట్లే ఉంది. కనుక కాంగ్రెస్ నేతృత్వంలో ఏకమవుతున్న విపక్షాలను చెదరగొట్టాలంటే బలమైన అంశం ఏదైనా ఉండాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ హయంలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమెర్జెన్సీ పీరియడ్) అంశం లేవనెత్తడం ద్వారా వాటి ఐక్యతను దెబ్బతీయవచ్చని భాజపా భావిస్తున్నట్లుంది.
దేశంలో ఎమర్జెన్సీ విధించి 42సం.లు పూర్తయిన సందర్భం కలిసి రావడంతో భాజపా నేతలు, కేంద్రమంత్రులు అందరూ దాని గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. వెంకయ్య నాయుడు వంటివారు దానిని విద్యార్ధుల చరిత్ర పాట్యాంశంగా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికేనని అర్ధం అవుతోంది.
భాజపాను గట్టిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు కూడా ఈ ఒక్క అంశంలో ఈ వాదోపవాదాలలో పాలు పంచుకొంటాయి. అప్పుడు స్వర్గీయ ఇందిరా గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శించకమానవు. అప్పుడు సహజంగానే వాటిపై కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం కలుగవచ్చు. ఇది వాటి మద్య దూరం పెంచుతుందని భాజపా భావిస్తునట్లుంది.
అయితే రాజకీయపార్టీలకు తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం తప్ప ఎప్పుడో 42సం.లు క్రితం జరిగిన దాని కోసం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాయనుకొంటే అవివేకమే. అందుకే మోడీ మూడేళ్ళ పాలనే ఎమర్జెన్సీని తలపిస్తోందని కాంగ్రెస్ వాదనతో విపక్షాలు కూడా గొంతు కలుపుతున్నాయి.