తాండూరుకు చెందిన మడిచెర్ల సత్యం అనే రచయిత ముఖ్యమంత్రి కేసీఆర్ ను మహాత్మాగాంధీతో పోలుస్తూ తెలంగాణా గాంధీ అనే పుస్తకం రచించారు. దానిని మంత్రి హరీష్ రావు ఆదివారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అలనాడు మహాత్మా గాంధీలాగే కేసీఆర్ కూడా తెలంగాణా ఉద్యమాలను చాలా ప్రశాంతంగా, అహింసాయుతంగా, అదుపుతప్పకుండా నడిపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన రకరకాల వ్యూహాలు మహాత్మాగాంధీ వ్యూహాలను తలపిస్తాయి. ఎన్ని అవరోధాలు ఎదురైనా అలుపెరుగని పోరాటాలు చేసి చివరకు తెలంగాణా సాధించారు. రచయిత సత్యంగారు ఉద్యమ సమయంలో జరిగిన అనేక ఘటనలను చాలా చక్కగా కవితల రూపంలో వర్ణించారు. అందుకు ఆయనకు అభినందనలు,” అని అన్నారు.
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం 6 దశాబ్దాలుగా జరిగిన పోరాటాలన్నీ ఒక ఎత్తయితే, చివరి పదేళ్ళ ఉద్యమాలు ఒక ఎత్తు అని చెప్పవచ్చు. వాటిలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, జెఎసిలు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్న మాట ఎంత వాస్తవమో ఆ ఉద్యమాలను లక్ష్యసాధన దిశగా నడిపించిన వ్యక్తి తెరాస అధినేత కేసీఆర్ అనేది కూడా అంతే వాస్తవం. కనుక ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణా సాధనలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది. ఆ సంగతి తెలంగాణా ప్రజలందరికీ తెలుసు.
అయితే కెసిఆర్ ను భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన మహాత్మా గాంధీతో పోల్చడం సరైనదేనా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ఎందుకంటే గాంధీజీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి దేశాన్ని విముక్తి చేయాలనుకొన్నారే కానీ వారి పట్ల ఏనాడూ విద్వేషం ప్రదర్శించలేదు. అదేవిధంగా స్వాతంత్రోద్యమం చాలా ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా అయన కులమతాలు, బాషా, ప్రాంతాల భేదభావం చూపకుండా దేశప్రజలందరి పట్ల అపారమైన ప్రేమాభిమానాలు చూపించారు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. కనుక ఆ మహనీయుడితో ఎవరినీ పోల్చి చూడలేము. అటువంటి ప్రయత్నాలు చేస్తే విమర్శల పాలవుతారు తప్ప గాంధీజీ కాలేరు. కనుక ఆయన చూపిన మార్గంలో నడిచామని చెప్పుకొంటే ఎవరికైనా గౌరవంగా ఉంటుంది.