ముస్లిం రిజర్వేషన్ బిల్లు కారణంగా తెరాస, భాజపాల మద్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అదే కారణం చేత మజ్లీస్ పార్టీకి కాస్త దగ్గరయింది కూడా. కానీ ఇప్పుడు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి రాంనాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించడంతో మళ్ళీ పరిస్థితి తారుమారు అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు భాజపాకు దగ్గరైనట్లు సంకేతాలు ఇచ్చినట్లు అవడంతో కాంగ్రెస్, వామపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయన భాజపాతో రహస్య ఒప్పందం చేసుకొని ఇటువంటి అవసరసమయాలలో దానికి సహాయపడుతూ, మిగిలిన సమయాలలో దానితో గొడవపడుతున్నట్లు నటిస్తుంటారని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు.అయన ఆర్.ఎస్.ఎస్.మూలాలు ఉన్న వ్యక్తికి మద్దతు ఇచ్చి మైనార్టీలను మోసగించారని విమర్శించారు. అసలు ఏ కారణం చేత అటువంటి వ్యక్తికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు.
భాజపా పట్ల తెరాస విభిన్నంగా వ్యవహరిస్తున్న తీరు చూసినట్లయితే ఎవరికైనా ఇటువంటి అనుమానాలే కలుగుతాయి. అయితే రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరం కనుకనే కేంద్రంతో రాజీ పడవలసి వస్తోందని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. భాజపా తమ అభ్యర్ధి పేరును ముందుగానే తమకు తెలియజేసిందని కానీ కాంగ్రెస్అభ్యర్దిగా నిలబడిన మీరా కుమార్ పేరును కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి ముందుగా ఎందుకు తెలియాజేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ అభ్యర్ధి పేరును చెప్పనప్పుడు ఆమెకు మద్దతు ఈయవలసిన అవసరం లేదని అన్నారు.