ఆమె వైఖరిలో మార్పు వచ్చిందా?

June 24, 2017


img

జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులకు సానుభూతిగా వ్యవహరించే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? అనే అనుమానం కలిగే విధంగా వ్యవహరించారు. మొన్న గురువారం అర్దరాత్రి శ్రీనగర్ లో ఒక మశీదు వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీస్ డి.ఎస్.పి. మొహమ్మద్ ఆయూబ్ పండిట్ ను కొందరు స్థానికులు రాళ్ళతో, కర్రలతో కొట్టి అతికిరతకంగా చంపారు. సాధారణంగా అటువంటి ఘటనలపై స్పందించని ముఖ్యమంత్రి డి.ఎస్.పి. మొహమ్మద్ ఆయూబ్ పండిట్ భౌతికకాయానికి నివాళులు అర్పించడమే కాకుండా ఆ ఘటనపై మాత్రం చాలా తీవ్రంగా స్పందించారు. 

ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఒక పోలీస్ అధికారిని ఈవిధంగా అమానుషంగా రాళ్ళతో కొట్టి హత్య చేయడం చాలా బాధాకరం. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, తమ ప్రాణాలొడ్డి ఉగ్రవాదుల నుంచి ప్రజల ధనమానప్రాణాలను కాపడుతుంటే వారి పట్ల ఇంత అమానుషంగా వ్యవహరించడం చాలా తప్పు. కాశ్మీరీ యువత ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ, వారు సంయమనం కోల్పోకుండా చాలా నిగ్రహంతో వ్యవహరిస్తున్నారు. కానీ వారి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పదేపదే వారితో ఈవిధంగా వ్యవహరిస్తుంటే వారు తిరిగి జవాబు ఇస్తే ఏమవుతుంది? అందరూ ఆలోచించాలి. మన పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పోలీసులలో ఒకరు. అటువంటి వారితో ఈవిధంగా ప్రవర్తించడం చాలా తప్పు. డి.ఎస్.పి. మొహమ్మద్ ఆయూబ్ పండిట్ హత్యకు కారకులైనవారిపై కటిన చర్యలు తీసుకొంటాము,” అని అన్నారు.   

నిజానికి కాశ్మీర్ లో పరిస్థితి ఎప్పుడో అదుపు తప్పిపోయింది. పోలీసులపై, భద్రతాదళాలపై రాళ్ళు రువ్వడంలో కాశ్మీరీ యువతతో మహిలు, విద్యార్ధినులు సైతం పోటీ పడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. కాశ్మీరులో చిచ్చు పెట్టడానికి పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో, జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ నాయకులు వేర్పాటువాదులపట్ల సానుభూతి ప్రదర్శిస్తూ తమ రాష్ట్రానికి అంతే హాని చేసుకొంటున్నారు. కనుక ప్రస్తుత పరిస్థితులకు వారిని కూడా నిందించక తప్పదు. ఇక రాష్ట్రంలో ఈ పరిస్థితులను ముఖ్యమంత్రి ముఫ్తీ అదుపఉచేయలేని పరిస్థితిలో ఉన్నారు కనుక ఆమె తన అధికారాన్ని, పదవిని నిలబెట్టుకొనేందుకు ఆమెకు మోడీ సహకారం చాలా అవసరం. బహుశః అందుకే ఆమె వేర్పాటువాదులను విమర్శిస్తూ, పోలీసులను సమర్ధిస్తూ మాట్లాడి ఉండవచ్చు తప్ప వేర్పాటువాదం విషయంలో ఆమె వైఖరిలో మార్పు ఉండకపోవచ్చు.    



Related Post