మక్కాపై దాడి..ఖతర్ ప్రభావమేనా?

June 24, 2017


img

ముస్లింలకు పరమ పవిత్రమైన సౌదీఅరేబియాలోని మక్కా మసీదుపై దాడి చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సౌదీ పోలీసులు నిన్న సకాలంలో గుర్తించి అడ్డుకోవడంతో పెను విద్వంసం తప్పిపోయింది. అయితే ముస్లిం మతానికే చెందిన ఉగ్రవాదులు తమకు అత్యంత పవిత్రమైన మక్కా మసీదుపైనే ఎందుకు దాడి చేయాలనుకొన్నారు? అనే సందేహం కలుగుతుంది. దానికి చాలా బలమైన కారణమే కనిపిస్తోంది. 

ఖతర్ ప్రభుత్వం ఐసిస్ ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం అందజేస్తోందని ఆరోపిస్తూ సౌదీఅరేబియాతో పలు గల్ఫ్ దేశాలు ఇటీవల ఖతార్ తో దౌత్య సంబంధాలు తెంచుకొని దానిపై ఆంక్షలు విధించాయి. వాటి ఆరోపణలను ఖతర్ ప్రభుత్వం ఖండించింది. కానీ గల్ఫ్ దేశాలు తమ నిర్ణయం ప్రకటించిన రెండు మూడు రోజులకే ఐసిస్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు వాటి ఆరోపణలను దృవీకరిస్తున్నట్లున్నాయి. 

“అమెరికాకు బుద్ధి చెప్పినట్లే సౌదీఅరేబియాకు కూడా గట్టిగా బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని మేము భావిస్తున్నాం. త్వరలోనే సౌదీలో కూడా దాడులు చేస్తాము,” అని ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. వారు ఆ ప్రకటన చేసిన కొద్దిరోజులకే నిన్న మక్కాలో ఈ సంఘటన జరిగడం గమనిస్తే ఐసిస్ ఉగ్రవాదుల ప్రేరణతోనే ఇది జరిగిందనె అనుమానం కలుగుతోంది. ఒక మహిళా ఉగ్రవాదితో సహా సౌదీకు చెందిన ఐదుగురు వ్యక్తులే ఈ దాడికి ప్రయత్నించడం గమనిస్తే సౌదీ అరేబియాలో కూడా ఐసిస్ ఉగ్రవాదులు చాప క్రింద నీరులా పరుచుకొని ఉన్నారని అర్ధం అవుతోంది. ఇటీవల రష్యా, అమెరికా అగ్రరాజ్యాల వైమానిక దాడులతో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన ఐసిస్ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికే మక్కాను ఎంచుకొని ఉండవచ్చు. కానీ అదృష్టవశాత్తు సౌదీ పోలీసులు ముందుగానే పసిగట్టి వారిని అడ్డుకోవడంతో భయంకర విద్వంసం తృటిలో తప్పిపోయింది. కనుక ఐసిస్ ఉగ్రవాదుల హెచ్చరికలను సౌదీ ప్రభుత్వం తేలికగా తీసుకోవడానికి లేదని స్పష్టం అయింది. 


Related Post