మన ప్రభుత్వాలు ఆ ఆదాయం వదులుకోలేవా?

June 24, 2017


img

దేశమంతటా జాతీయ రహదార్లను ఆనుకొని అనేక మద్యం దుఖాణాలున్నాయి. ఆ కారణంగా ఆ రహదార్లపై ప్రయాణించేవారిలో అనేకమంది మద్యం సేవించి వాహనాలు నడిపిస్తుండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో అనేకమంది మరణిస్తూనే ఉన్నారు. కనుక జాతీయరహదారులకు 100 మీటర్ల లోపు మద్యం దుఖాణాలు, బార్లు ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో దేశంలో కొన్నివేల  మద్యం దుఖాణాలు, బార్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. 

ఈ సమస్యకు తెలంగాణా ప్రభుత్వం విరుగుడు కనుగొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే జాతీయ రహదారులను డీ-నోటిఫై చేయాలని కోరుతూ కేంద్రానికి ఒక లేఖ వ్రాసింది. కేంద్రం అందుకు అంగీకరిస్తే గ్రేటర్ పరిధిలోగల ఎన్.హెచ్.44,65లు జి.హెచ్.ఎం.సి.అధీనంలోకి వస్తాయి. అప్పుడు జాతీయ రహదార్లను ఆనుకొని ఉన్న మద్యం దుఖాణాలు, బార్లకు అది అనుమతించవచ్చు.  

మనుషుల ప్రాణాలు కాపాడాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే, మద్యం వ్యాపారుల ఒత్తిళ్ళ వలనో లేక మద్యం ద్వారా వచ్చే బారీ ఆదాయాన్ని కోల్పోకూడదనే ఆలోచనతోనో ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేయడం చాలా బాధాకరం. అంటే మనుషుల ప్రాణాల కంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయమే దానికి ముఖ్యం అన్నట్లుంది. 

ఇక నగరంలో రోడ్లనే సరిగ్గా నిర్వహించలేక తీవ్ర విమర్శలకు గురవుతున్న జి.హెచ్.ఎం.సి. చేతికి జాతీయ రహదారులను కూడా అప్పగిస్తే వాటికీ అదే గతి పట్టవచ్చు. 

ఒకప్పుడు ఆటవిక రాజ్యంగా పేరుపడిన బీహార్ లో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంపూర్ణ మద్యపానం నిషేధం అమలుచేస్తున్నారు. దాని వలన తన ప్రభుత్వానికి వేలకోట్లు ఆదాయం కోల్పోయిన పరువాలేదు కానీ ప్రజల జీవితాలు బాగుపడితే చాలని చెపుతుంటారు. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఒక నగరం పరిధిలో వచ్చే మద్యం ఆదాయాన్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రజలే మా దేవుళ్ళు అని చెప్పుకొనే రెండు రెండు రాష్ట్రాల అధినేతలు ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తున్నట్లయితే ఇటువంటి ఆలోచనలు చేయకూడదు. 


Related Post