అవును.. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశం అల్లకల్లోలం అయిపోతుందిట. ఎందుకంటే ఆయనకు ఆర్.ఎస్.ఎస్. మూలాలు ఉన్నాయిట! తెలంగాణా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
జైపాల్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత మల్లు రవి తదితరులు ఈరోజు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “అసలు అభ్యర్ధి ఎవరో తెలుసుకోకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇస్తామని ఏవిధంగా ప్రకటించారు?ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్నందునే రాంనాథ్ కోవింద్ కు మద్దతు తెలుపుతున్నారు,” అని వారు ఆరోపించారు.
తెలంగాణా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంలో మీరా కుమార్ సహకారం కూడా చాలా ఉందని ఎవరూ మరిచిపోకూడదని అన్నారు. కనుక తెలంగాణాలో అన్ని పార్టీల ఎంపిలు అందరూ మీరా కుమార్ కే ఓటువేయాలని వారు కోరారు.
నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే దళితుడో లేదా ముస్లిం వ్యక్తో రాష్ట్రపతి అయినంత మాత్రాన్న ఆ వర్గాల ప్రజలకు ఏమి ప్రయోజనం ఉండదు. అదేవిధంగా ఆర్.ఎస్.ఎస్.మూలాలున్న వ్యక్తి రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి అయినా వచ్చే ప్రమాదం ఏమి ఉండదు. ఒకవేళ ఉండి ఉంటే ఆయన బిహార్ గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడే పెద్ద సమస్య ఏర్పడి ఉండేది. కానీ అటువంటిదేమీ జరుగలేదు పైగా ఆయన అధికార జెడియు ప్రభుత్వంతో దాని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో చక్కటి స్నేహసంబంధాలు కలిగి ఉన్నారు. ఆ కారణంగానే నితీష్ కుమార్ కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. కనుక కాంగ్రెస్ నేతల వాదనలు రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్నవిగానే భావించవచ్చు.