తెలంగాణా వైకాపా ప్లీనరీ సమావేశం గురువారం ఎల్.బి.నగర్ లోని చంపాపేటలో జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ రామకృష్ణారెడ్డి పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2024 నాటికి వైకాపా అధికారంలోకి రావాలనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకోసం ఇప్పటి నుంచే అందరూ కలిసికట్టుగా నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ సమావేశంలో ఓటుకు నోటు కేసులో ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెరాస సర్కార్ పై ఒత్తిడి పెంచాలని, తెరాస హామీల అమలులో వైఫల్యాలు, రాష్ట్రంలో రైతుల సమస్యలు, సింగరేణి కార్మికుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి మొదలైన 12 అంశాలపై తీర్మానాలు చేసి వాటిని ఆమోదించారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డిని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు.
తెలంగాణాలో ప్రజల సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్, తెదేపా, భాజపాలే తెరాస ధాటిని తట్టుకొని నిలబడలేకపోతున్నాయి. కేవలం లోటస్ పాండ్ కే పరిమితమైన వైకాపా తెరాసను ఎదురొడ్డి పోరాడి తెలంగాణా ప్రజలను మెప్పించి అధికారంలోకి రావడం కల్ల.
ఇక ఓటుకు నోటు కేసు తెదేపా-తెరాసల మధ్య జరిగిన రాజకీయ యుద్ధంగా చెప్పవచ్చు. దానితో తెలంగాణా వైకాపాకు అసలు సంబంధమే లేదు. ఆ కేసును కెలికితే తెలంగాణా వైకాపాకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదు కానీ ఏపి వైకాపాకు రాజకీయంగా ఉపయోగపడుతుంది. కనుక జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికే ఈ తీర్మానం చేసినట్లు చెప్పవచ్చు.