మహారాష్ట్రాలో రైతులు పంట రుణాల మాఫీ, గిట్టుబాటు ధరల కోసం చేస్తున్న ఆందోళన నిన్న ఉదృతరూపం దాల్చింది. అదే సమయంలో ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “పంట రుణాల మాఫీ చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. రైతులు బ్యాంకులలో రుణాలు తీసుకోవడం తరువాత వాటిని మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ డిమాండ్లు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పాకిపోతున్నాయిప్పుడు. కేవలం క్లిష్ట పరిస్థితులలోనే పంటరుణాల మాఫీ చేస్తారు. అదే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు,” అని అన్నారు.
వెంకయ్యనాయుడు చెప్పింది సహేతుకమే కానీ భాజపాతో సహా అన్ని పార్టీలు అధికారంలోకి రావడం కోసమే రైతులను ఆకర్షించడానికి పంటరుణాల మాఫీని ఒక పెద్ద వలలాగ ఉపయోగించుకొంటున్నాయి. రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఈ పద్దతిని రైతులకు అలవాటు చేశాయి తప్ప రైతులు కాదు. కానీ ఇప్పుడు వెంకయ్య నాయుడు వంటి నేతలు రైతులను నిందిస్తున్నారు.
విజయ్ మాల్యా 17 బ్యాంకులకు రూ.9,000 ఎగవేసి లండన్ పారిపోతే ఏమీ చేయలేక అతనివి మొండిబకాయిల పద్దులో రాసుకొని ఆ డబ్బుపై ఆశలు వదులుకొన్నాయి. పైకి అతను ఒక్కడే కనబడుతున్నాడు కానీ దేశంలో ఇంకా అనేక మంది బడా పారిశ్రామికవేత్తలు, కార్పోరేట్ కంపెనీలు సుమారు రూ.2 లక్షల కోట్లు బాకీలు ఎగవేశాయని బ్యాంకులే చెపుతున్నాయి. వారు రుణాల పేరిట దర్జాగా బ్యాంకులను దోచుకొంటుంటే బ్యాంకులు, ప్రభుత్వాలు కూడా వారికే అండగా నిలబడుతున్నాయి.
అదే...అన్నదాత చేతిలో డబ్బులేకపోయినా అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నాడు. ఆ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు మనసొప్పదు. ప్రభుత్వాలు పేద రైతులకు భూమి ఇవ్వకపోగా వారి భూములనే బలవంతంగా గుంజుకొని దేశాన్ని అభివృద్ధి పేరిట నిలువునా దోచేస్తున్న బడా పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థలకు కారుచవుకగా దానం చేసేస్తుంటాయి. ఇక నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులు, దళారులు, అవినీతి అధికారులు..ప్రభుత్వాల నియమనిబంధనలు అన్నీ రైతన్నలను పీల్చి పిప్పి చేసి చివరకు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఈ పరిస్థితులలో రుణమాఫీ చేయమని రైతులు అడిగితే అది నేరం అన్నట్లు వెంకయ్య నాయుడు అందం చాలా దారుణం.