ఆ ఫార్ములా భాజపాకు సూట్ అవుతుందా?

June 20, 2017


img

తెలంగాణాలో భాజపాను బలోపేతం చేసుకోవడానికి ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి ఆహ్వానించుకోవడానికి అమిత్ షా ఎప్పుడో అనుమతించేశారు కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ సదాశివపేటకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలకు సోమవారం కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి చేరికకు కారకుడైన భాజపా యువమోర్చ నేత అభిషేక్ గౌడ్ ను ఆయన అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా అంతర్ధానం అయిపోతోందని కనుక తెరాసకు భాజపా ఒక్కటే ప్రత్యామ్నాయమని అన్నారు. పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మోడీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలలో ప్రచారం చేసినట్లయితే వచ్చే ఎన్నికలలో భాజపాయే తప్పకుండా విజయం సాధిస్తుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

రాజకీయ పార్టీలు ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను తమ పార్టీలలో చేర్చుకోవడం సహజమే. ఆవిధంగా చేయడం ద్వారా తమ పార్టీలు బలోపేతం అయ్యాయని వారు భావిస్తుంటారు. అలాగే చెప్పుకొంటుంటారు కూడా. కొన్ని సందర్భాలలో అది నిజమేనని రుజువయింది కూడా కానీ అన్ని పార్టీలకు..అన్ని సందర్భాలలో అది పనికిరాదని కూడా నిరూపితం అయ్యింది. కనుక ఇప్పుడు ఆ ఫార్ములా తెలంగాణాలో భాజపాకు సూట్ అవుతుందా లేదా? అని ఆలోచిస్తే కాదనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే భాజపా తప్ప మిగిలినవన్నీ సెక్యులర్ భావాలున్న పార్టీలే. కనుక వాటిలో ఎవరైనా సులభంగా ఇమిడిపోగలరు. కానీ హిందుత్వం పునాదిగా ఏర్పడిన భాజపాలో సెక్యులర్ పార్టీల నుంచి వచ్చినవారు ఇమడటం చాలా కష్టం. సహజంగా హిందూ భావజాలం బలంగా ఉన్నవారైతేనే భాజపాలో ఇమడగలరు. అందుకే సాధారణంగా భాజపాలో ఉన్నవాళ్ళు ఇతరపార్టీలలోకి వెళ్ళరు..ఇతర పార్టీలలో ఉన్నవాళ్ళు భాజపాలోకి వెళ్ళే ఆలోచన చేయరు. కానీ ఏపిలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పురందేశ్వరి, కావూరి, కన్నా వంటివారు భాజపాలో చేరవలసి వచ్చింది. కానీ తెలంగాణాలో అటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ బలంగా ఉంది. భాజపాయే బలహీనంగా ఉంది. కనుక హిందూ సిద్దాంతం పట్ల నమ్మకున్న వ్యక్తులను మాత్రమే చేర్చుకొని వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోగలిగితే భాజపా బలపడగలదు తప్ప కొద్ది మంది కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీలో  చేర్చుకొన్నంత మాత్రాన్న రాష్ట్రంలో భాజపా బలపడుతుందనుకొంటే అవివేకమే.


Related Post