సింగరేణి కార్మికుల సమ్మె నేటితో 6వ రోజుకు చేరింది. అయినా నేటికీ కార్మిక సంఘాలకు, యాజమాన్యాయానికి మద్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడలేదు. ఈ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి అనేక సూటి ప్రశ్నలు సందించారు.
“తెలంగాణా ప్రభుత్వం వరుసగా జారీ చేస్తున్న జీవోలను కోర్టులు కొట్టివేయడం గమనిస్తుంటే, వాటిని నిజంగానే అమలు చేయాలనే ఉద్దేశ్యంతోనే జారీ చేస్తోందా లేకపోతే ఉద్దేశ్యపూర్వకంగానే సాంకేతిక లోపాలతో కూడిన జీవోలను రూపొందించి జారీ చేస్తూ కోర్టులు అవి కొట్టిపడేస్తే, జీవోలు జారీ చేశాము కానీ కోర్టులు కొట్టేస్తే మేమేమి చేయగలము? అని చెప్పుకోవడానికే ఆవిధంగా తప్పులతడకలతో జీవోలను రూపొందిస్తోందా? అనే అనుమానం కలుగుతోంది. సింగరేణి కార్మికులు కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే అమలుచేయమని కోరుతున్నాయి. కానీ ఈవిషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనబడటం లేదు. ఇక సింగరేణి యాజమాన్యం తీరు చూస్తే అది తన ఉద్యోగులను వి.ఆర్.ఎస్. తీసుకోవడానికే అన్-ఫిట్ చేస్తోందా లేక అన్-ఫిట్ అయినందునే వి.ఆర్.ఎస్. ఇస్తోందా? ఒకవేళ ఉద్యోగులు అన్-ఫిట్ కండిషన్ లో ఉన్నట్లు భావిస్తున్నట్లయితే వారికి వి.ఆర్.ఎస్.కు బదులు వారసత్వ ఉద్యోగావకాశం ఎందుకు కల్పించడం లేదు? ప్రభుత్వం కూడా అందుకు అంగీకరిస్తూ జీవో జారీ చేసింది కదా?” అని ప్రశ్నించారు. సింగరేణి కార్మికులను నిర్బందించి సమ్మెను విచ్చినం చేయాలనుకోవడం వెర్రి ఆలోచన అని అన్నారు.
ఐ.ఎఫ్.టి. రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర రావు కూడా ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి ఒక సూటి ప్రశ్న వేశారు. న్యాయ సలహాల కోసం అవి రెండూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటాయి. అంత ఖర్చు చేసినా కోర్టులలో నిలిచేవిధంగా జీవోలు ఎందుకు రూపొందించలేకపోతున్నారంటే అర్ధం ఏమిటి? సమ్మె చేస్తున్న 15,000 మంది కార్మికులను విధులకు హాజరుకావడంలేదనే వంకతో ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడం ఏమనుకోవాలి? ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఇకనైనా ఇటువంటి కుట్రపూరితమైన చర్యలు మానుకొని వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే బాగుంటుంది,” అని అన్నారు.