కోవింద్ కే మా మద్దతు: కేసీఆర్

June 19, 2017


img

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా బిహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ పేరును భాజపా ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అన్ని పార్టీల ప్రముఖులకి స్వయంగా ఫోన్లు చేసి ఆవిషయం తెలియజేసి వారి మద్దతు కోరసాగారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏపి, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు కూడా ఫోన్ చేసి మద్దతు కోరగా వారిరువురూ వెంటనే అంగీకరించారు. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చాలా సమర్ధుడు, మేధావి, దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసారని చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనకు మద్దతు ఇస్తామని వెంటనే ప్రకటించారు. ఏపిలో జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల క్రితమే ఎన్డీయే ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టినా మద్దతు ఇస్తామని ప్రకటించారు.

 ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేపటి క్రితమే సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ లకు ఫోన్ చేసి ఈవిషయం చెప్పి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు తెలుపవలసిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ అయన అభ్యర్ధిత్వానికి మద్దతు పలికినట్లయితే, ఆయన ఎన్నికకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు. ఆయన భాజపాకు చెందినవారనే ఏకైక కారణం తప్ప ఆయన అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించడానికి బలమైన కారణాలు ఏవీ లేవు కనుక కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకవచ్చు. కాదని ఎవరినైనా పోటీకి నిలబెట్టినా గెలిపించుకొనేందుకు బలం సరిపోదు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతు పలుకవచ్చు.

బిహార్  కు గవర్నర్ వ్యవహరిస్తున్న రామ్ నాథ్ కోవింద్ తో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సత్సంబందాలే ఉన్నాయి కనుక ఆయన మద్దతు ప్రకటించవచ్చు. ఆయన యూపికే చెందినవారు కావడం, దళితుడు కావడం చేత యూపిలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కూడా మద్దతు పలుకవచ్చు. కానీ ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా ద్వేషించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరినీ ఒప్పించవలసి ఉంది. మమతను ఒప్పించే బాధ్యత ఏపి సి.ఎం. చంద్రబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. 


Related Post