రాష్ట్రపతి ఎన్నికలకు ఈనెల 14 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. కానీ ఇంతవరకు ఎన్డీయే తన అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. రాష్ట్రపతి అభ్యర్ధి పేరు సూచించి, అతను లేదా ఆమె అభ్యర్ధిత్వానికి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం ముగ్గురు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడులతో కూడిన ఒక కమిటీ నియమించింది. వారు ప్రతిపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఎన్డీయే మిత్రపక్షాల నేతల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈరోజు భాజపా పార్లమెంటరీ సమావేశం జరిగింది. మంత్రుల కమిటీ సభ్యులు కూడా దానిలో పాల్గొన్నారు. వారు సమర్పించిన నివేదిక ఆధారంగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్దిపై ఈరోజు సమావేశంలో చర్చించారు. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తను ఈ రేసులో లేనని ప్రకటించినప్పటికీ ఆమె పేరే ప్రధానంగా వార్తలలో వినిపిస్తోంది. ఆమె తరువాత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేరు వినిపిస్తోంది. ఇంకా అనేకమంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ వీరిద్దరిలోనే ఎవరో ఒకరికి ఈ అత్యన్నత పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నామినేషన్లు వేయడానికి ఈనెల 28వ తేదీ చివరి రోజు. కనుక 23న తమ అభ్యర్ధి నామినేషన్ వేస్తారని భాజపా ప్రకటించింది. ఈరోజు భాజపా పార్లమెంటరీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే ఉంటారు కనుక నేడో రేపో తమ అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం ఉంది.