కేసీఆర్ చెప్పిన మాట నమ్మొచ్చా?

June 19, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ ఉపవాసాల సందర్భంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అయన నమ్మశక్యం కాని మాట ఒకటి చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాష్ట్రంలో భాజపా నేతలతో సహా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఇంకా అనేక మంది భాజపా జాతీయ నాయకులు తాము మతప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెపుతున్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని కేసీఆర్ చెప్పడం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ అదే నిజమైతే భాజపా నేతలు ఎవరూ ఈవిధంగా వ్యతిరేకించి ఉండేవారు కాదు కదా?

ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని చెపుతూనే మళ్ళీ ఒకవేళ ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచడానికి కేంద్రం అంగీకరించకపోతే దానితో పోరాడటానికి వెనుకాడను అని చెప్పడం విశేషం. ఇదే నిజం అని చెప్పవచ్చు. కేంద్రప్రభుత్వం ఎలాగూ అంగీకరించదు కనుక ఎన్నికలకు ముందు కేసీఆర్ చేయబోయే పని అదే. ఆయన మజ్లీస్ పార్టీ సహాయం లేకుండా రాష్ట్రంలోని ముస్లిం ఓటు బ్యాంక్ ను స్వాధీనం చేసుకోవాలని కలలు కంటున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలనే ఆయన చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. కానీ అది తన పరిధిలో లేని అంశం అని తెలిసి కూడా దాని కోసం బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం ఎన్నికల రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడవలసి ఉంటుంది. కేంద్రం ఎలాగూ దీనికి అంగీకరించదు కనుక దీని కోసం కాస్త రాజకీయ, న్యాయపోరాటాల  హడావుడి కూడా చేసి, ఎన్నికల సమయంలో దీనిని గట్టిగా హైలైట్ చేసినట్లయితే ముస్లింల ఓట్లు సంపాదించుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన కావచ్చు. కనుక దీనితో ముస్లింలకు రిజర్వేషన్లు రాకపోయినా వచ్చే ఎన్నికలలో తెరాసకు ఈ అంశం ఎంతో కొంత లబ్ది కలిగించడం ఖాయం. 


Related Post