బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన శ్రావణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అతనికి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో మంచి పరిచయాలు ఉండేవని తెలిసింది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తదితర కాంగ్రెస్ నేతలతో దిగిన ఫోటోలు ఇప్పుడు మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే అవేమీ వారిని వేలెత్తిచూపడానికి పనికిరావనే చెప్పవచ్చు. ఎందుకంటే శ్రావణ్ వంటివారు అనేక వందలమంది అటువంటి ప్రముఖ రాజకీయ నేతలతో ఫోటోలు దిగడానికి, వారితో పరిచయాలు కలిగిఉండటానికి ఇష్టపడతారు. కానీ శ్రావణ్ కోమటిరెడ్డితో దిగిన ఒక ఫోటోలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కనబడటం చేత అతను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కలిగిఉన్నడా? అనే అనుమానం కలుగుతోంది. అతను ఎస్సై పరీక్షలకు శిక్షణ తీసుకొనేందుకు హైదరాబాద్ వచ్చాడు. కానీ తనకు సంబంధం లేని ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించి పోలీస్ స్టేషన్ లో కూర్చోవాల్సిన వాడు జైలులో కూర్చొన్నాడు.