బ్యూటీషియన్ శిరీష్ ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితులు శ్రవణ్, రాజీవ్ లను పోలీసులు ఎ-1, ఎ-2 నిందితులుగా పేర్కొనడంతో నాంపల్లి కోర్టు వారిరువురికీ రెండు వారాలు రిమాండ్ విధించింది. పోలీసులు వారిరువురినీ చంచల్ గూడా జైలుకు తరలించారు. నిజానికి శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా పేర్కొనబడిన ఇద్దరూ ఆమెఫై ఎటువంటి హత్య, అత్యాచార ప్రయత్నాలు చేయలేదు. ఆమె తప్పించుకొని పోవాలని ప్రయత్నించినప్పుడు కారులో కొట్టారు.
శిరీష్ ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుసుకొన్న తరువాత తీవ్ర భయాందోళనలకు గురైన కుకునూరుపల్లి ఎస్.ఐ. ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకొని ఉండకపోతే అతను కూడా నిందితులతోబాటు చంచల్ గూడా జైలుకు వెళ్ళ వలసివచ్చేది. ఎందుకంటే అతను తాగిన మైకంలో శిరీషపై అత్యాచార ప్రయత్నం చేశాడని కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు.అయితే శిరీష-రాజీవ్-తేజస్విని ముగ్గురి గొడవలతో ఏ సంబంధమూ లేని ప్రభాకర్ రెడ్డి శిరీష్ తన ఇంటికి వచ్చినప్పుడు మద్యం మత్తులో ఆమెపై అత్యాచార ప్రయత్నం చేసినందున,ఆ తరువాత కొద్ది సేపటికే ఆమె ఆత్మహత్య చేసుకొన్నందున దానికి ప్రభాకర్ రెడ్డే కారణం అని భావించవలసి వస్తుంది. కనుక ఒకవేళ అతను బ్రతికి ఉండి ఉంటే తప్పకుండా జైలుకు వెళ్ళవలసి వచ్చి ఉండేదని చెప్పవచ్చు. శిరీష-శ్రావణ్-రాజీవ్-తేజస్విని ఈ నలుగురి గొడవలతో ఏ సంబంధమూ లేని ప్రభాకర్ రెడ్డి ఈ కేసులో అనవసరం వేలు పెట్టి బలైపోయాడు.
శిరీష తన ఆత్మహత్యకు కారణం ఏమీ చెప్పలేదు. చివరిసారిగా రాజీవ్ కు వీడియో కాల్ చేసినప్పుడు అతను ఆ కాల్ ను రిసీవ్ చేసుకోలేదు. రిసీవ్ చేసుకొని ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోగలిగేవాడు లేదా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకొందో తెలిసి ఉండేది. కనుక అది రహస్యంగానే మిగిలిపోయింది.
ఇక ఈ కేసులో శ్రవణ్, రాజీవ్ ఇద్దరూ శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి కారకులయ్యారు కనుకనే పోలీసులు వారిని నిందితులుగా పేర్కొని ఉండవచ్చు. అయితే వారిరువురూ ప్రత్యక్షంగా ఎటువంటి నేరమూ చేయలేదు కనుక కొద్దిపాటి శిక్షతోనే బయటపడే అవకాశం కనబడుతోంది.