వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సింగరేణి కార్మికులు మొదలుపెట్టిన సమ్మె నేటితో 3వ రోజుకు చేరింది. గుర్తింపు పొందిన సంఘానికి చెందిన కార్మికులు తప్ప మిగిలిన జాతీయ కార్మిక సంఘాల కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొంటుండటంతో సింగరేణిలో ఒక్కసారిగా బొగ్గు ఉత్పత్తి పడిపోయింది. కార్మికులలో అధికశాతం సమ్మెలో పాల్గొంటునందున వారు చేయవలసిన పనులు నిలిచిపోయాయి. దానితో ప్రస్తుతం గనులలో పనిచేస్తున్నవారు కూడా పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
కానీ కార్మికుల సమ్మె ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై పడలేదని సింగరేణి యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సమారు 10-20,000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నా యధాప్రకారం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న మాట వాస్తవం అయితే సింగరేణిలో అంతమంది కార్మికులు అవసరం లేదని భావించవలసి ఉంటుంది. ఇప్పటికే విజయవాడ తదితర ధర్మల్ పవర్ స్టేషన్ లలో బొగ్గు నిలువలు అడుగంటిపోతున్నాయి. కనుక బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే అప్పుడు సింగరేణి యాజమాన్యం మీదనే తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. అప్పుడు సమ్మె ప్రభావం ఉందో లేదో ఎవరూ చెప్పకుండానే అందరికీ తెలుస్తుంది. అయితే వారసత్వ నియామకాలను కోర్టులు వ్యతిరేకిస్తునందున కార్మిక సంఘాలు సూచిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి సింగరేణి యాజమాన్యం ఆలోచిస్తే మంచిది. అదేవిధంగా సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలు కూడా రాజకీయాల గురించి ఆలోచించకుండా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పట్టువిడుపులు ప్రదర్శించి వీలైనంత త్వరగా సమ్మెను ముగిస్తే అందరికీ మంచిది.