జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మళ్ళీ దాడి చేశారు. అనంతనాగ్ జిల్లాలో ఆచబల్ పట్టణంలో స్థానిక పోలీసులు జీపులో వెళుతుండగా 15మంది ఉగ్రవాదులు వారి వాహనాన్ని చుట్టుముట్టి కాల్పులు జరుపడంతో డ్రైవర్, స్టేషన్ ఆఫీసర్ తో సహా మొత్తం ఆరుగురు పోలీసులు చనిపోయారు. తరువాత ఉగ్రవాదులు వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకుపోయారు. ఆ దాడికి పాల్పడింది తామేనని లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పారిపోయిన ఆ ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతాదళాలు గాలింపు జరుపుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఇటువంటి దాడుల కారణంగా ఆ రాష్ట్రంలో పోలీస్ లేదా ఆర్మీలో ఉద్యోగం అంటే ప్రాణాలను పణంగా పెట్టి చేయవలసిన దుస్థితి నెలకొని ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఇటీవల మన భద్రతాదళాలు సరిహద్దులలో పాక్ బంకర్లపై దాడి చేసి వాటిని నాశనం చేశాయి. సరిహద్దు ప్రాంతాలలో బారీగా గాలింపు చర్యలు చేపట్టి 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అయినా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉండటం గమనిస్తే వారికి స్థానికంగా మద్దతు లభిస్తోందని అర్ధం అవుతోంది. స్థానికులు కూడా తరచూ పోలీస్ స్టేషన్లపై, భద్రతాదళాలపై దాడులు చేస్తుండటం గమనిస్తే వారిలో భారత్ వ్యతిరేకత ఎంత బలంగా ఉందో అర్ధం అవుతోంది. ఆ వ్యతిరేకతతోనే వారు ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు అన్నివిధాల సహకరిస్తున్నట్లు భావించవచ్చు. కనుక ఈ సామాజిక సమస్యను పరిష్కరిస్తే తప్ప జమ్మూ కాశ్మీర్ లో శాంతి ఏర్పడే అవకాశం ఉండదు.
దీనిని అదుపు చేయాలంటే, ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల వద్ద అడ్డుకోవడం ఎంత ముఖ్యమో, జమ్మూ కాశ్మీర్ లోపల తిష్ట వేసుకొన్న ఉగ్రవాదులను, వేర్పాటువాదులను ఏరివేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ప్రజలలో వేర్పాటువాద భావనలు క్రమంగా తగ్గుముఖం పట్టి రాష్ట్రంలో మళ్ళీ శాంతి ఏర్పడుతుంది. అయితే ఇది సాధ్యం కాదని 70 ఏళ్ళ చేదు అనుభవాలు చెపుతున్నాయి. కనుక జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు, జవాన్ల ప్రాణాలకు కూడా ఎటువంటి భరోసా లేదనే చేదు నిజాన్ని కూడా అంగీకరించక తప్పదేమో!