రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శుక్రవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అంటే కేవలం పేదవాళ్ళు తలదాచుకొనే గూళ్ళు మాత్రమే కాదు. అది వారి ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఒకప్పుడు కాంగ్రెస్ హయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళంటే పిచ్చుక గూళ్ళు వాలే ఉండేవి. కానీ పేదవాళ్ళు కూడా మనలాగా మనుషులే. వారికీ సరిపడినంత ఇళ్ళు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు బెడ్ రూమ్ లు, హాలు కిచెన్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారు. అందుకే ఇవి పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెపుతున్నాము. ఈవిధంగా పేదల కోసం గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలో మరొకరుండరేమో? ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం పేదవాళ్ళ దగ్గర నుంచి ఒక్కపైసా తీసుకోకుండా అంతా ప్రభుత్వమే భరించి నిర్మించి ఇస్తోంది. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఇళ్ళు నిర్మిస్తున్నాము. వీటి కోసం మన ప్రభుత్వం రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తోంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నీ కలిపి నిర్మిస్తున్న ఇళ్ళ కోసం ఖర్చు చేస్తున్నదాని కంటే ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇళ్ళ నిర్మాణంలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే వారిని తక్షణం జైలుకు పంపించడానికి కూడా వెనుకాడము,” అని అన్నారు.
రాష్ట్రాభివృద్ధి గురించి వివరిస్తూ “మన రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోంది. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం మన రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా ఉండటమే. అయినప్పటికీ మన ప్రతిపక్షాలు మాపై నోటికి వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వాలకు, మన ప్రభుత్వానికి పాలనలో తేడాను మీరందరూ గుర్తించి బేరీజు వేసుకోవాలని కోరుతున్నాను. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ పనుల కోసం రెండు కోట్లు తెచ్చుకోవాలంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కాళ్ళు అరిగిపోయేల తిరగవలసి వచ్చేది, కానీ ఇప్పుడు మన అవసరాలను స్వయంగా తెలుసుకొని అడగకముందే నిధులు మంజూరు చేసే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయన నేతృత్వంలో తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొందాము. ప్రతిపక్షాల కువిమర్శలను మనం పట్టించుకోనవసరం లేదు,” అని అన్నారు.