భారత్-పాక్ లకు తేడా అదే!

June 16, 2017


img

ముంబై ప్రేలుళ్ళ కేసుపై 24 సం.ల సుదీర్గ విచారణ తరువాత టాడా కోర్టు ఈరోజు తీర్పు ప్రకటించింది. ఆ ప్రేలుళ్ళలో నిందితులుగా పేర్కొనబడిన అబుసలేంతో సహా ఏడుగురు దోషులేనని ప్రకటించింది. వారు నేరస్తులని దృవీకరించేందుకు జరిగిన దర్యాప్తు కోసం, ఈ కోర్టు విచారణలకు, ఇంత కాలం ఆ కరడుగట్టిన నేరస్తులను జైలులో ఉంచి వారి ఆహారం, ఆరోగ్యం, కోర్టు విచారణల కోసం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు. దేశంలో అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించడానికి వెనుకాడే ప్రభుత్వాలు మన దేశం మీద దాడి చేసి అతికిరాతకంగా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకొన్న ఇటువంటి కిరాతకులను దోషులు అని నిరూపించేందుకు వందల కోట్లు ఖర్చు చేయడం చాలా బాధాకరమే కానీ మన న్యాయవ్యవస్థ తీరే అంత కనుక ప్రభుత్వాన్ని కూడా నిందించలేని పరిస్థితి. 

భారత్ లో పరిస్థితి ఈవిధంగా ఉంటే, మనపై దశాబ్దాలుగా పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ లో మరోవిధంగా ఉంది. భారత్ నేవీ మాజీ ఉద్యోగి కులభూషన్ జాదవ్ గూడచర్యానికి పాల్పడుతూ 2016 మార్చిలో బలూచిస్తాన్ లో పట్టుబడినట్లు పాక్ చెపుతోంది. కానీ అతనిపై పాక్ కోర్టులలో ఎటువంటి విచారణ జరుపకుండా, అతని నేరాన్ని నిరూపించే ఎటువంటి ఆధారాలు చూపకుండా పాక్ మిలటరీ కోర్టు 2017,  ఏప్రిల్ 10న అతనికి మరణశిక్ష విదించింది. అంటే సరిగ్గా 12 నెలలోనే ప్రక్రియ అంతా పూర్తిచేసేసిందన్న మాట. కానీ అదే మన దేశంలో24 సం.లు పట్టింది.

కులభూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేయాలని కోరుతూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కనుక అతను ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నాడు. లేకుంటే ఎప్పుడో ఉరిశిక్ష తీయబడి ఉండేవాడు. ఇప్పటికీ అతని ప్రాణాలకు భరోసా ఏమీ లేదు. కానీ ముంబై ప్రేలుళ్ళకు పాల్పడిన వీరందరికీ ఒకవేళ టాడా కోర్టు మరణశిక్షలు విధించినా మళ్ళీ వారు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ తరువాత రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం వగైరా తంతు సాగుతుంది. కనుక ఈ కేసు మరో రెండు మూడేళ్ళు సాగినా ఆశ్చర్యం లేదు. ఇది భారత్ న్యాయవ్యవస్థ గొప్పదనం అనుకోవాలా లేక బలహీనత అనుకోవాలా?


Related Post