యూపీఏ సర్కార్ ఏపికి రాజధాని లేకుండా చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ పిర్యాదు చేస్తుంటారు. తన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాదిస్తున్న ఆయన ఈవిషయంలో పొరుగు రాష్ట్రానికి అన్యాయం చేయడం తప్పుగా భావించడం లేదు. ఆ కారణంగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మూడేళ్ళు పూర్తయినా ఇంతవరకు రాష్ట్రానికి హైకోర్టు లేదు. మరో రెండేళ్ళవరకు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు కూడా. హైకోర్టు విభజనకు చంద్రబాబు నాయుడు సహకరించకపోవడానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ కేంద్రప్రభుత్వం కూడా ఈవిషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు.
హైకోర్టు విభజనకు సహకరించమని ప్రధాని నరేంద్ర మోడీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడును ఆదేశిస్తే కాదనగలరా? అంటే కాదనే చెప్పవచ్చు. అయినా ఎందుకు చెప్పడం లేదు? అంటే ఏపిలో తెదేపాతో స్నేహమే కారణం అని భావించవలసి ఉంటుంది. అదీగాక ఒకవేళ హైకోర్టు విభజన కోసం బాబుపై గట్టిగా ఒత్తిడి చేస్తే ఆయన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల విడుదల, రాజధాని అమరావతితో సహా ఇతర ప్రాజెక్టులకు నిధుల విడుదల కోసం గట్టిగా మాట్లాడితే ఏపిలో భాజపాకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. ఏపిలో భాజపా మనుగడకు తెదేపా సహకారం చాలా అవసరం. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ బాబుపై ఈవిషయంలో ఒత్తిడి తేవడం లేదని అనుమానించక తప్పదు.
వందల కోట్లు ఖర్చు చేసి ఏడాదిలోగానే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ, మండలి భవనాలను నిర్మించుకొన్న చంద్రబాబు తలుచుకొంటే తాత్కాలిక హైకోర్టు కూడా నిర్మించుకోగలరు. కానీ నిర్మించుకోరు. అయినా కేంద్రం ఆయనపై అందుకు ఒత్తిడి చేయదు. ఎవరి కారణాలు, సమస్యలు వారికున్నాయి. కనుక హైకోర్టు విభజనపై ప్రతీ ఏడాది ఒకసారి పాడిందే పాత పాటను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మళ్ళీ పాడారు.
ఆయన గురువారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “హైకోర్టు విభజనపై అనేక కేసులు దాఖలయ్యాయి. వాటికి ఏకైక పరిష్కారం ఏపిలో హైకోర్టు ఏర్పాటు చేయడమే. ఏపి సర్కార్ హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, మౌలిక వసతులను కల్పించినట్లయితే, కేంద్రప్రభుత్వం ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు సిద్దంగా ఉంది. కానీ అమరావతిలో హైకోర్టు భవనం సిద్దం అయ్యేవరకు ఉమ్మడి హైకోర్టు విభజన సాధ్యం కాకపోవచ్చు. త్వరలోనే ఏపి సర్కార్ అమరావతిలో హైకోర్టు భవనాలను సిద్దం చేసుకొంటుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు.
అమరావతిలో హైకోర్టు భవనం సిద్దం అయ్యేవరకు ఉమ్మడి హైకోర్టు విభజన సాధ్యం కాదనే సంగతి కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పనవసరం లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ అమరావతిలో హైకోర్టు భవనం ఎప్పుడు సిద్దం అవుతుందో ఆయనకి కూడా తెలియదు. అయినా అమరావతిలో హైకోర్టు భవనానికి ఉమ్మడి హైకోర్టు విభజనతో లంకె పెట్టి అంతవరకు ఎదురు చూడమనడం ఏమనుకోవాలి? దీనికి పరిష్కారమే లేదా? ముఖ్యమంత్రి కేసీఆర్ తాను దేని కోసమైనా గట్టిగా పట్టుబడితే ఏదైనా సాధించగలనని చెప్పుకొంటారు. మరి దీని కోసం ఎందుకు పట్టుపట్టడం లేదు???